- Advertisement -
- మున్సిపల్, ఆహార భద్రత అధికారుల తనిఖీల లేమిపై విమర్శలు
నవతెలంగాణ – రాయికల్
పట్టణంలోని ఓ మార్ట్‌కు సరుకులు కొనుగోలు చేయడానికి వెళ్లిన ఓ వినియోగదారుడు అక్కడ విక్రయానికి ఉంచిన పిండి డబ్బాలో బల్లి కనిపించడంతో ఆశ్చర్యానికి గురయ్యాడు. పిండిని పరిశీలిస్తున్న సమయంలో డబ్బాలో బల్లి కనిపించడంతో వెంటనే మార్ట్ సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. దీంతో సిబ్బంది డబ్బాలోని బల్లిని తీసి పడవేశారు. అయితే ఆహార పదార్థాల విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని సూపర్ మార్కెట్లలో గతంలో నాణ్యతలేని,గడువు ముగిసిన వస్తువుల విక్రయాలపై ఆరోపణలు వస్తుండగా, తాజాగా పిండిలో బల్లి కనిపించడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. నాణ్యత, ఆఫర్ల కోసం మార్ట్‌లకు వెళ్లే వినియోగదారులకు ఇలాంటి ఘటనలు ఎదురవడం అధికారుల పర్యవేక్షణ లోపానికి నిదర్శనమని స్థానికులు విమర్శిస్తున్నారు.
ఆహార పదార్థాలను పరిశుభ్రంగా నిల్వ చేయడంతో పాటు నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని ప్రజలు కోరుతున్నారు. ఇటు మున్సిపల్ అధికారులు, అటు ఆహార భద్రత శాఖ అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించకపోవడంతో ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని ఆరోపిస్తున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక తనిఖీలు చేపట్టి,నిబంధనలు ఉల్లంఘిస్తున్న వ్యాపార సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
- Advertisement -



