నవతెలంగాణ-అచ్చంపేట
పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతుల కోసం విశ్రాంతి గదులు నిర్మాణం చేశారు. నల్లమల్ల ప్రాంతం అచ్చంపేట నియోజకవర్గం లోని వివిధ గ్రామాల నుంచి రైతులు పంటలు విక్రయించడానికి అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ కు రావడం జరుగుతుంది. ఎండలు తీవ్రంగా మండిపోతున్నాయి. అమ్మకాలు, కొనుగోలు లలో తీవ్ర జాప్యం జరుగుతుందని కొందరు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు రైతులు అవస్థలు పడుతున్నారు.
ఇలాంటి సందర్భంలో రైతులు భోజనాలు చేసుకోవడానికి విశ్రాంతి తీసుకోవడానికి మార్కెట్ ఆవరణలో విశ్రాంతి భవనం నిర్మించారు. కానీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా విశ్రాంతి భవనం నిరుపయోగంగా మారింది. ఆ భవనానికి అధికారులు తాళం వేస్తున్నారు. దీంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు చెట్ల కింద భోజనాలు చేసి, చెట్ల కిందనే విశ్రాంతి తీసుకుంటున్నారు. మార్కెట్ శాఖ అధికారులు ఆదాయం పైన చూపుతున్న శ్రద్ధ మార్కెట్ యార్డులో రైతులకు వసతులు, సౌకర్యాలు కల్పించడంలో శ్రద్ధ చూపడం లేదని రైతులు బహిర్గతంగా ఆరోపిస్తున్నారు. రైతు విశ్రాంతిభవనం వినియోగంలోకి తీసుకురావాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.



