మరెవరినైనా చూసుకోండి.. ‘మేడిగడ్డ’ పునరుద్ధరణపై చేతులెత్తేసిన సీడీవో

నవతెలంగాణ – హైదరాబాద్: ప్రతిష్ఠాత్మక కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల పునరుద్ధరణ తమ వల్ల కాదని, మరెవరినైనా చూసుకోవాలని తెలంగాణ సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ (సీడీవో) స్పష్టం చేసింది. ఇటీవల మేడిగడ్డ పియర్స్ కుంగిపోయాయి. అన్నారం బ్యారేజీలో సీపేజీ ఏర్పడింది. ఈ నేపథ్యంలో వీటికి మరమ్మతులు చేసి పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సీడీవో చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. నిర్మాణ సమయంలోని మోడల్ స్టడీస్‌కు, బ్యారేజీ నిర్వహణ తీరుకు పొంతన లేదని, అందుకనే ఈ సమస్య తలెత్తిందని సీడీవో అభిప్రాయపడినట్టు సమాచారం. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లతోపాటు రాష్ట్రంలోని భారీ, మధ్యతరహా ప్రాజెక్టులకు డిజైన్లు ఇచ్చింది సీడీవోనే. అయితే, ఇప్పుడు దెబ్బతిన్న మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల పునరుద్ధరణ పనులకు సంబంధించిన నైపుణ్యం తమ వద్ద లేదంటూ చేతులెత్తేసింది. అత్యాధునిక సామర్థ్యం ఉండి, దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్న సంస్థలను ఎంపిక చేసి బ్యారేజీల రక్షణకు సంబంధించిన డిజైన్లు తీసుకోవాలని సూచించింది.

Spread the love