– నేడు, రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది. ఈ అల్పపీడనం రాబోయే మూడు రోజుల్లో ఉత్తర ఒడిశా, ఉత్తర చత్తీస్‌గఢ్ మీదుగా వెళ్లే అవకాశముంది. రాష్ట్రంలో వచ్చే రెండు రోజుల పాటు మోస్తరు వానలు, పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి కె.నాగరత్న తెలిపారు. శుక్రవారం నాడు ఆదిలాబాద్, కొమ్రంభీమ్ అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, కామారెడ్డి జిల్లాల్లో… శనివారం నాడు మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, సిద్దిపేట, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే సూచనలున్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికను జారీ చేశారు. గురువారం రాత్రి పది గంటల వరకు రాష్ట్రంలో 126 ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. మంచిర్యాల జిల్లా కొత్తపల్లి మండలం దేవులవాడలో అత్యధికంగా 5.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. 26 ప్రాంతాల్లో మోస్తరు వాన పడింది.