Thursday, June 25, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంటీ హబ్ ఉన్నా పనిచేయని మిషన్లు

టీ హబ్ ఉన్నా పనిచేయని మిషన్లు

- Advertisement -

​వారం రోజులుగా నిలిచిన రక్త పరీక్షలు
వ్యాధుల నిర్ధారణకు రోగుల అవస్థలు..
ప్రయివేటు హాస్పటళ్ల వైపు పరుగులు
చెత్తమయంగా తయారైన దవాఖానా
ఇదీ.. మెదక్ ప్రభుత్వ ఆస్పత్రి దుస్థితి
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి

మెదక్ ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు కీలకమైన వైద్య పరీక్షలు అందించాల్సిన సీబీపీ (కంప్లీట్ బ్లడ్ పిక్చర్) మిషన్ పనిచేయకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రక్తంలోని వివిధ అంశాలను గుర్తించి వ్యాధుల నిర్ధారణకు ఉపయోగించే ఈ యంత్రం పాడై వారం రోజులుగా మూలన పడిపోయింది. దీంతో ఆస్పత్రికి వచ్చే పేద, మధ్యతరగతి రోగులు సరైన సమయంలో పరీక్షలు చేయించుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. జ్వరాలు, రక్తహీనత, ఇన్ఫెక్షన్లు, ఇతర అనారోగ్య సమస్యలను గుర్తించేందుకు సీబీపీ పరీక్ష ఎంతో అవసరం. దాంతో రోగులు ప్రయివేటు డయాగ్నస్టిక్ కేంద్రాలను ఆశ్రయించాల్సి వస్తోంది. ఆస్పత్రి అధికారులు పాడైన మిషన్ మరమ్మతులు లేదా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి పెట్టడం లేదని రోగుల బంధువులు ఆరోపిస్తున్నారు. పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ప్రభుత్వ ఆస్పత్రిలో ఇలాంటి సమస్యలు కొనసాగడం పట్ల అసంతృప్తి వ్యక్తమవుతోంది. మెదక్ ఆస్పత్రిలో పరిస్థితులపై ‘నవతెలంగాణ’ సర్వే చేసిన సందర్భంగా అనేక సమస్యలు వెలుగులోకి వచ్చాయి.
​మెదక్ జిల్లా కేంద్రానికి టీ హబ్ సైతం ఏర్పాటు చేశారు. కాగా, ఏ వ్యాధి నిర్ధారణ కావాలన్నా తప్పనిసరిగా సీబీపీ పరీక్షలు నిర్వహించాల్సిందే. అలాంటి రక్త పరీక్షలు నిర్వహించే సీబీపీ మిషన్ పాడై పోయింది. వారం రోజులు దాటిపోయినా దాన్ని బాగు చేయించకుండా, కొత్తది తీసుకురాకుండా రోగులకు రక్త పరీక్షలు చేయకుండా నిర్లక్ష్యం జరుగుతుంది. అధికారులు మాత్రం తప్పనిసరి పరీక్షలు కావాలంటే మాత్రం చేయిస్తున్నామని చెబుతుండటం గమనార్హం.

​ప్రభుత్వాస్పత్రిలో మందుల కొరత..
మెదక్ ప్రభుత్వాస్పత్రిలో మందుల కొరత రోగులను ఇబ్బందులకు గురిచేస్తోంది. ఆస్పత్రికి వచ్చే పేద, మధ్యతరగతి రోగులకు ఉచితంగా అందాల్సిన కొన్ని రకాల మందులు అందుబాటులో లేకపోవడంతో బయట మెడికల్ దుకాణాల్లో కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉచిత వైద్యం అందుతుందనే ఆశతో ప్రభుత్వాస్పత్రికి వచ్చిన వారికి మందుల కోసం అదనపు ఖర్చు తప్పడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రిలో మందుల నిల్వలు, సరఫరా వ్యవస్థపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని రోగులు కోరుతున్నారు.

​చెత్తమయంగా ఆస్పత్రి..
ప్రజలు రోగాల బారిన పడి ప్రభుత్వాస్పత్రికి వెళితే తగ్గేలా ఉండాలి. కానీ మెదక్ ఆస్పత్రి ఆవరణ మొత్తం చెత్తమయంగా మార్చివేశారు. పాడైన వస్తువులు, డబ్బాలు, బీరువాలు, ఇతర చెత్త సామాన్లు.. ఆస్పత్రి ఆవరణలోనే పాడేస్తున్నారు. దాంతో ఉన్న రోగమేమో కానీ కొత్త రోగాలు మాత్రం ఖాయంగా కనిపిస్తున్నది. ఆస్పత్రి ఆవరణ పూర్తిగా అపరిశుభ్రంగా మారినా పట్టించుకున్న పాపాన పోవడం లేదు. దీనిపై రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
​సీబీపీ మిషన్ బాగుచేయించాలి :
 కె.నర్సమ్మ, సీపీఐ(ఎం) మెదక్ జిల్లా కార్యదర్శి
రోగాలను నిర్ధారించేందుకు ఉపయోగించే సీబీపీ పరీక్షల మిషన్ పాడైపోయి వారం రోజులు దాటిపోయింది. కానీ దాన్ని బాగు చేయించడం లేదు. వెంటనే సీబీపీ మిషన్ బాగు చేయించాలి. ఇతర పరీక్షలు కూడా 24 గంటలు గడిస్తే గానీ రిపోర్టులు ఇవ్వడం లేదు. జిల్లా కేంద్రంలో పరీక్షలు నిర్వహించే హబ్ ఒకటే ఉంది. జిల్లాలోని అన్ని పీహెచ్సీల నుంచి వచ్చే రక్త పరీక్షలు కూడా జిల్లా కేంద్రానికే వస్తున్నాయి. దాంతో రోగులకు పరీక్షలు త్వరితగతిన జరగకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే రక్త పరీక్షలు నిర్వహించాలి.

​కొత్త సీబీపీ మిషన్ కొనుగోలు చేశాం : రవీందర్, మెదక్ ప్రభుత్వాస్పత్రి, ఇన్‌చార్జి సూపరింటెండెంట్
రక్తపరీక్షల మిషన్(సీబీపీ) పాడైపోయింది. కానీ దాన్ని రిపేరు చేయించాం. అయినా కూడా దానికి షార్ట్ సర్క్యూట్ అవుతుంది. అందుకోసం కొత్త సీబీపీ మిషన్‌ను కొనుగోలు చేశాం. దాన్ని త్వరలో ఫిట్ చేస్తాం. ఆస్పత్రిలో మందులకు ఎలాంటి కొరత లేదు. కావాల్సిన మందులు అందుబాటులో ఉన్నాయి. అదే విధంగా రక్త పరీక్షలు అత్యవసరం అయితే టెస్ట్‌లు చేయిస్తున్నాం. కానీ అన్నింటికీ వీలు పడదు. మిషన్ బాగుపడితే అన్ని టెస్ట్‌లు చేస్తాం. మెడికల్ కాలేజీ కాబట్టి స్పెషలిస్ట్ డాక్టర్లు ఉన్నారు. ఎలాంటి ఇబ్బంది లేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -