13న ప్రభుత్వ వైద్యుల మహాధర్నా

–  తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఉస్మానియా ఆస్పత్రి ఆవరణలో ఈ నెల 13న మహాధర్నా నిర్వహించనున్నట్టు తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం తెలిపింది. ఈ మేరకు ఆ సంఘం సెంట్రల్‌ కోర్‌ కమిటీ బుధవారం సమావేశమైంది. ఉస్మానియా ఆస్పత్రి నూతన భవన నిర్మాణం, పీఆర్సీ ఎరియర్స్‌ పెండింగ్‌ విషయాలను కమిటీ ప్రతినిధులు చర్చించారు. అనంతరం ప్రతినిధులు ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వానికి నోటీసులిచ్చి నెల గడుస్తున్నా ఎలాంటి స్పందన లేకపోవడం పట్ల అసంతప్తి వ్యక్తం చేశారు. ఇటీవల విడుదల చేసిన అవతవకలతో కూడుకున్న జీవో నెంబర్‌ 142ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆ జీవోతో వైద్యులకు, వైద్య సిబ్బందికి తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. డిప్యూటీ డిఎంహెచ్‌ఓ కార్యాలయాలు రద్దు చేయడం, అందులో ఉన్న సిబ్బందిని ఇతర ప్రదేశాలకు పంపించడం ద్వారా అన్ని క్యాడర్లకు రాబోయే కాలంలో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయని తెలిపారు. వైద్య విధాన పరిషత్‌లో పనిచేసే ఉద్యోగులందరికీ ట్రెజరీ ద్వారా జీతాలు చెల్లించాలని, వారికి హెల్త్‌ కార్డులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

Spread the love