ఆర్టీసీకి ‘మహాలక్ష్మి’ డబ్బులు ఇవ్వాలి

ఆర్టీసీకి 'మహాలక్ష్మి' డబ్బులు ఇవ్వాలి– ప్రభుత్వం ఆ సొమ్మును బడ్జెట్‌లో కేటాయించాలి
– హయ్యర్‌ పెన్షన్‌పై ఆందోళనలు
– టీఎస్‌ఆర్టీసీ ఎస్‌డబ్ల్యూఎఫ్‌ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశం డిమాండ్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలో మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల ఆర్టీసీ రోజుకు రూ.15 కోట్ల ఆదాయం కోల్పోతున్నదనీ, ప్రభుత్వం ఆ డబ్బులను రాబోయే పూర్తి స్థాయి బడ్జెట్‌లో కేటాయించి, ప్రతినెలా చెల్లించాలని టీఎస్‌ఆర్టీసీ స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ (ఎస్‌డబ్ల్యూఎఫ్‌) డిమాండ్‌ చేసింది. ఆదివారంనాడిక్కడి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఫెడరేషన్‌ అధ్యక్షులు వీరాంజనేయులు అధ్యక్షతన రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం జరిగింది. సంఘం ప్రధాన కార్యదర్శి వీఎస్‌ రావు మాట్లాడారు. ఆర్టీసీ దగ్గర నిధులు లేవనే పేరుతో ఇంతవరకు 2013 ఆర్పీఎస్‌ ఎరియర్స్‌ చెల్లించక పోవడం సరైంది కాదనీ, ఆ సొమ్ము వెంటనే చెల్లించాలని సమావేశం కోరింది. జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుల పరీక్షలకు డ్రైవర్లను కూడా అనుమతించడంపై యాజమాన్యానికి ధన్యవాదములు తెలిపారు. కార్మికులపై పెరుగుతున్న వేధింపులు ఆపాలనీ, అవసరం అయిన సిబ్బందిని రిక్రూట్‌మెంట్‌ జరపాలని, నల్సాఫ్ట్‌ వల్ల వస్తున్న సమస్యలు పరిష్కరించాలని కోరారు.
హైయ్యర్‌ పెన్షన్‌ సమస్యలపై ఆందోళనలు
హైయ్యర్‌ పెన్షన్‌ విషయంలో ఆర్పీఎఫ్‌సీ ద్వారా ఆటంకాలు సృష్టించడం మానుకోవాలనీ, అర్హత కలిగిన అందరికి చట్టం ప్రకారం పెన్షన్‌ చెల్లించాలని రీజినల్‌ ప్రొవిడెంట్‌ ఫండ్‌ కమిషనర్‌కు సమావేశం విజ్ఞప్తి చేసింది. పెన్షన్‌ సమస్యలు కార్మికుల దృష్టికి తీసుకెళ్లేందుకు జులై మొదటి వారంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ఎస్‌డబ్ల్యూఎఫ్‌ల సంయుక్తాధ్వర్యంలో రాష్ట్ర సదస్సు నిర్వహించాలనీ, జులై చివరి వారంలో ”చలో పీఎఫ్‌ కమిషనర్‌” పిలుపు ఇవ్వడం ద్వారా ఆందోళన నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. కార్యక్రమంలో ఎస్‌డబ్య్లూఎఫ్‌ వ్యవస్థాపక కార్యదర్శి వీ రాములు, రాష్ట్ర ఉపాధ్యక్షులు కేఎస్‌ రెడ్డి, ఏవీ రావు, బిక్షపతి గౌడ్‌, ఎమ్‌ ప్రభాకర్‌, రాష్ట్ర కార్యదర్శులు టీ ఎల్లయ్య, కోశాధికారి కే గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసిస్టెంట్‌ మేనేజర్‌ నుంచి అకౌంట్స్‌ ఆఫీసర్‌గా పదోన్నతి పొందిన గంగాధర్‌ను శాలువాతో సత్కరించారు.

Spread the love