మహిళలను ఆర్థికంగా శక్తిమంతులు చేయడమే “మహిళా శక్తి” పథకం ముఖ్య ఉద్దేశమని, మహిళా శక్తి పథకాన్ని జిల్లాలో విజయవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ హనుమంతు కే.జండగే అధికారులకు సూచించారు. మంగళవారం నాడు జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో మహిళా శక్తి కార్యక్రమంపై సంబంధిత శాఖలైన గ్రామీణ అభివృద్ధి, సెర్ప్, నాబార్డ్, లీడ్ బ్యాంకు, పశు, మత్స్య, వ్యవసాయ, స్త్రీనిధి, పరిశ్రమలు, విజయ డైరి తదితర శాఖల అధికారులు, జిల్లా సమాఖ్య, మండల సమాఖ్యల ప్రతినిధులతో జరిగిన సమన్వయ సమావేశంలో ప్రణాళిక రూపకల్పన, అమలుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలను ఆర్థికంగా శక్తిమంతులను చేయడమే మహిళా శక్తి పథకం ముఖ్య ఉద్దేశమని, ఈ పథకాన్ని జిల్లాలో దిగ్విజయంగా నెరవేర్చాలని సూచించారు. స్వయం సహాయ సంఘాల ద్వారా పలు రకాల సూక్ష్మ పరిశ్రమలు, వ్యాపారాలను ప్రోత్సహించి సంఘాలలో సభ్యులుగా ఉన్న మహిళల ఆర్థిక స్వావలంబనకు సహకరించడం, మహిళల సామాజిక భద్రత కోణంలో సంఘాలను బలోపేతం చేయడం మహిళా శక్తి పథకం ప్రధాన ఉద్దేశాలని అన్నారు.
సూక్ష్మ తరహా పరిశ్రమలను గుర్తించి, అందులో సంఘాలను ప్రోత్సహించడం, ఆయా సంఘాలలో మహిళలు తమ నైపుణ్యాలకు తగ్గ ఉత్పత్తులను ఎంచుకుని, ఆ ఉత్పత్తులకు అవసరమైన నైపుణ్యాన్ని అందించడం, ఉత్పత్తికి అవసరమైన ఆర్థిక సహకారం కోసం బ్యాంక్ లింకేజీల సదుపాయం కల్పించడం, ఉత్పత్తి అయిన సరుకులు మార్కెటింగ్ కు అవసరమైన ప్రణాళికలు, సహకారం అందివ్వడం మహిళాశక్తి పథకంలో భాగమని తెలిపారు. మైక్రో ఎంటర్ప్రైజెస్, పర్మనెంట్ స్టిచింగ్ సెంటర్లు, పాడి గేదెల పెంపకం, మొబైల్ ఫిష్ అవుట్ లెట్, పాల డైరీల ప్రోత్సాహం, మీసేవ కేంద్రాలు, మహిళా శక్తి క్యాంటీన్లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, వ్యవసాయ అనుబంధ పరికరాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ లు తదితర 14 రకాల జీవనోపాదులు ఇందులో భాగమని తెలిపారు. మహిళా శక్తి పథకంలో జిల్లాలో 2024- 25 సంవత్సరానికి 12,451 యూనిట్లకు పథకం వర్తింప చేయడం జరుగుతుందని తెలిపారు. స్వయం సహాయక సంఘాలను లాభసాటి ఎంట్రపేన్యూర్లుగా తీర్చిదిద్దడానికి మహిళా శక్తి తీసుకురావడం జరిగిందని తెలిపారు. ఎంపిక చేసి వారికి స్త్రీనిధి బ్యాంకు రుణాలను టైఅప్ చేయాలని తెలిపారు. లబ్ధిదారులు తమ పథకాలు ఎల్లకాలం నడుపుకునేలా మార్కెట్టింగ్ అవకాశాలపై దృష్టి పెట్టాలన్నారు. బ్యాంకులు ముందుగానే కావలసిన డాక్యుమెంట్ల చెక్ లిస్ట్ గ్రూపులకు అందించి రుణ సౌకర్యాన్ని సులభతరం చేయాలని, ఇందుకోసం సంబంధిత శాఖలు ముందుగానే డైరెక్ట్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకోవాలని, ముందుగా కొన్ని మోడల్ పైలట్ ప్రాజెక్టులను ప్రారంభించాలని, తద్వారా పథకాల నిర్వహణ, మార్కెట్టింగ్ అంశాలపై అవగాహన, మెలకువలు తెలుస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కె గంగాధర్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఎంఏ కృష్ణన్, అడిషనల్ డిఆర్.డిఓ శ్రీనివాస్, సంబంధిత శాఖల జిల్లా అధికారులు, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు రేణుక, కార్యదర్శులు సంతోష, మౌనిక లు పాల్గొన్నారు.