మందకృష్ణ మోసం, బీజేపీ కుట్రలను భగం చేస్తాం : క్రిస్టియన్‌ జేఏసీ

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
మందకృష్ణ మాదిగ మోసాన్ని, బీజేపీ కుట్రలను భగం చేస్తామని క్రిస్టియన్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ తెలిపింది. ఈ మేరకు సోమవారం హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దళిత క్రైస్తవులు వర్గీకరణకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. అయితే మాదిగ క్రైస్తవులను మతోన్మాద బీజేపీ చేతిలో బలి పశువులను చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఎన్నికల వేళ వర్గీకరణ డ్రామా ఆపాలనీ, ప్రధాని మోడీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే లోక్‌సభ ఎన్నికల్లోపు పార్లమెంటులో బిల్లు పెట్టించాలని డిమాండ్‌ చేశారు. గతంలో చంద్రబాబు, కాంగ్రెస్‌ ఎన్నికల్లో వాడుకున్నట్టుగానే బీజేపీ మందకృష్ణను ఈ ఎన్నికల్లో వాడుకోవాలని చూస్తున్నదన్నారు. రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న మాదిగలకు, మాదిగ క్రైస్తవులకు పదవులివ్వకుండా కాంగ్రెస్‌ పార్టీ కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీని గెలిపించుకుంటామని తెలిపారు.
కాంగ్రెస్‌ను గెలిపించండి
– క్రైస్తవులను మోసం చేసిన బీఆర్‌ఎస్‌
– ఇండియన్‌ క్రిస్టియన్‌ కౌన్సిల్‌
బీఆర్‌ఎస్‌ పార్టీ అన్ని రకాలుగా క్రైస్తవులను మోసం చేసిందని ఇండియన్‌ క్రిస్టియన్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు సోమవారం హైదరాబాద్‌లోని సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఐసీసీ చైర్మెన్‌ శావల జోసఫ్‌ మీడియాతో మాట్లాడారు. క్రైస్తవేతరుడైన రాజేశ్వర్‌ రావుకు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టడమే కాకుండా క్రిస్టియన్‌ మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మెన్‌ పదవిలో కూర్చబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతరులకు నామినేటెడ్‌ పోస్టులను అప్పజెప్పి క్రైస్తవులకు ఇచ్చినట్టు తప్పుడు ప్రచారంతో మోసం చేసిందని విమర్శించారు. క్రైస్తవుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిన బీఆర్‌ఎస్‌ను ఓడించాలనీ, క్రైస్తవుల సంక్షేమానికి స్పష్టమైన హామీ ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీని గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.

Spread the love