మన్నెంలో గుప్పుమంటున్న ‘గంజాయి’

'Marijuana' in Mannem– గుడుంబా కేంద్రాలుగా శివారు కాలనీలు
– పెరిగిపోతున్న నేరాలు… చితికిపోతున్న జీవితాలు
నవతెలంగాణ-భద్రాచలం రూరల్‌
చత్తీస్‌గడ్‌, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన భద్రాచలంలో నిషేధిత మత్తు పానీయాల విక్రయాలతో జీవితాలు చింద్రమైపోతున్నాయి. నాలుగు రాష్ట్రాలకు సరిహద్దు ప్రాంతం కావడంతో ఇటు చత్తీస్గఢ్‌, ఒరిస్సా నుండి నిషేధిత గంజాయిని భద్రాచలానికి అతి సులబంగా తరలిస్తూ పసి జీవితాలను మత్తు పానీయాలకు బానిసలుగా మారుస్తున్నారు. పట్టణంలోని శివారు కాలనీలు గుడుంబా కేంద్రాలుగా తయారవు తున్నాయి. చత్తీస్గడ్‌, ఒరిస్సా రాష్ట్రాలలో యదేచ్చగా లభించే నిషేధిత గంజాయిని హైదరాబాద్‌ బెంగుళూరు వంటి మహానగరాలకు తరలించాలంటే ఉన్న ఏకైక మార్గం భద్రాచలం కావడంతో అక్రమార్కులు ఈ మార్గం గుండానే గంజాయిని తరలిస్తున్నారు. నిషేధిత గంజాయి తరలింపుకు అడ్డకట్ట వేసేందుకు పోలీస్‌ శాఖ వారు మూడంచెల నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసినప్పటికీ తరలిపోయే గంజాయిలో సగం మేరకే పట్టుబడుతుందన్న విమర్శలు వినబడుతున్నాయి. గంజాయిని భద్రాచలం గుండా తరలించడమే కాక ఈ ప్రాంత యువత, విద్యార్థులు సైతం గంజాయికి బానిసలు కావటం ఆందోళన గురి చేసే అంశం. విచ్చలవిడిగా లభిస్తున్న గంజాయికి అతి చిన్న వయసులోనే విద్యార్థులు, యువకులు, బానిసలు కావడంతో ఆ మత్తులో వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. గంజాయి కొనుగోలు చేయటానికి దొంగతనాలు, దోపిడీలే కాక ఆ గంజాయి మత్తులో హత్యలకు సైతం వెనుకాడటం లేదు. గత నెల హౌలీ పండుగ రోజున వెంక రెడ్డి పేటలో జరిగిన మైనర్‌ విద్యార్థి హత్యకు కూడా ప్రధానంగా గంజాయి కారణమని ఆ మత్తులోనే తోటి విద్యార్థి పై విచక్షణ రహితంగా కత్తులతో దాడి చేసిన ఘటనలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఇదే కాక పట్టణ వ్యాప్తంగా గంజాయి మత్తులో అనేక రకాల నేరాలు జరుగుతున్నప్పటికీ గంజాయి విక్రయం పై ఉక్కు పాదం మోపటంలో ఇటి పోలీస్‌ శాఖ వైఫల్యం చెందిందనే స్పష్టమవుతుంది. మరోపక్క గత సంవత్సరం కాలం నుండి పట్టణంలోని శివారు కాలనీలలో గుడుంబా ఏరులైపాడుతున్నప్పటికీ ఎక్సైజ్‌ శాఖ వారు ఆ వైపు కూడా కన్నెత్తి చూడటం లేదన్న విమర్శలు వినపడుతున్నాయి. ప్రధానంగా భద్రాచలం పట్టణంలోని అశోక్‌ నగర్‌, కొత్త కాలనీ, ఏంసీకాలనీ, అయ్యప్ప కాలనీ, రాజుపేట వంటి శివారు ప్రాంతాలలో విచ్చలవిడిగా గుడుంబాను విక్రయిస్తున్నప్పటికీ ఎక్సైజ్‌ శాఖ వారు గుడుంబా నియంత్రణ కంటే మద్యం అమ్మకాలు పైనే ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన పవిత్ర పుణ్యక్షేత్రం అయినా భద్రాచలం పట్టణంలో ఓపక్క గంజాయి మరోపక్క గుడుంబాతో యువత జీవితాలు చితికి పోతున్న తరుణంలో స్వచ్ఛంద సంస్థల వారు యువతకు ప్రత్యేక కౌన్సిలింగ్‌ ఇచ్చి యువతను సన్మార్గంలో పెట్టేందుకు కృషి చేయాలని పలువురు కోరుతున్నారు.
గుడుంబా, గంజాయి పై ఉక్కు పాదం మోపాలి
భద్రాచలం పట్టణంలోని శివారు కాలనీలలో గుడుంబా ఏరులై పారడంతో పాటు యువత, విద్యార్థులు గంజాయికి బానిసలు అవుతున్నారు. గుడుంబా, గంజాయి విక్రయాలపై పోలీస్‌ ఎక్సైజ్‌ శాఖ వారు ఉక్కు పాదం మోపాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకించి అశోక్‌ నగర్‌ కొత్త కాలనీలో గుడుంబా ఏరులై పారుతున్నప్పటికీ ఎక్సైజ్‌ శాఖ వారు స్థానిక మహిళలు ఫిర్యాదు చేసిన పట్టించుకోకపోవడం తో ఆ ప్రాంతంలో అసా ంఘిక కార్యక్రమాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. గతంలో కొత్త కాలనీ ప్రాంతంలో మహిళలు స్వచ్ఛందంగా సారా వ్యతిరేక పోరాట కమిటీని వేసి గుడుంబాని అరికట్టగలి గారు. కానీ ఇటీవల కాలంలో కొత్త కాలనీలో మళ్లీ గుడుంబ విక్రయాలు జోరుగా కొనసాగుతున్నప్పటికీ ఎక్స్చేంజ్‌ శాఖ వారు అటువైపు కూడా తొంగి చూడక పోవటం విడ్డూరంగా ఉంది. గుడుంబా నియంత్రణలో ఎక్సైజ్‌ శాఖ వారు చిత్తశుద్ధితో పనిచేయకపోతే సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో మహిళా సంఘాలను కలుపుకొని ప్రత్యక్ష పోరాటానికి దిగుతాము.
– సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి

Spread the love