నవతెలంగాణ – పరకాల : పరకాల నియోజకవర్గంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు ముందు ప్రత్యేక అధికారుల పాలనలో భారీగా అవినీతి జరిగిందని, కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైందని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తీవ్రస్థాయిలో ఆరోపించారు. నియోజకవర్గంలోని సర్పంచులు, ఉపసర్పంచులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అధికారులు పనులు చేయకుండానే నిధులు కాజేశారని, ప్రజాధనాన్ని అడ్డగోలుగా దోచుకున్నారని మండిపడ్డారు.
పనులు జరగకుండానే బిల్లుల చెల్లింపులు, అక్రమ మొరం తవ్వకాలు, బతుకమ్మ పండుగ ఏర్పాట్లు చేయకుండానే నిధుల డ్రా, పని చేయని మోటార్ల పేరుతో తప్పుడు బిల్లులు సృష్టించడం వంటి అక్రమాలు వెలుగు చూశాయని ఆయన పేర్కొన్నారు. ఎంబీ రికార్డులు లేకుండానే బిల్లులు చెల్లించి, ఇప్పుడు ఆ బాధ్యతలను సర్పంచులపై రుద్దేందుకు ఎంపీడీఓలు, ఎంపీఓలు ప్రయత్నిస్తున్నారని, దీనిని తాము సహించబోమని హెచ్చరించారు. అధికార పార్టీ నాయకుల మెప్పు కోసం అధికారులు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతున్నారని, ఇటువంటి పక్షపాత ధోరణిని మానుకోవాలని ఆయన సూచించారు.
ప్రత్యేక అధికారుల పాలన మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు పరకాల, నడికూడ, ఆత్మకూర్, దామెర, గీసుగొండ, సంగెం మండలాల్లో జరిగిన అన్ని పనులు, నిధుల వినియోగంపై విజిలెన్స్ అధికారులతో సమగ్ర విచారణ జరిపించాలని చల్లా ధర్మారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు హనుమకొండ, వరంగల్ జిల్లా కలెక్టర్లను కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రజాధనాన్ని దోచుకున్న అధికారులపైనా, బాధ్యులపైనా కఠిన చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.



