– డివిజన్ 30, 33 లో విస్తృత పర్యటన నిర్వహించిన మేయర్ కూరగాయల ఉమారాణి
నవతెలంగాణ-కంఠేశ్వర్ :
ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యం అని నిజామాబాద్ నగర మేయర్ కూరగాయల ఉమారాణి అన్నారు. నిజామాబాద్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలనే సంకల్పంతో నగర మేయర్ కూరగాయల ఉమా రాణి శనివారం 30,33 వ డివిజన్‌లలో విస్తృతంగా క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. కాలనీల్లో ఇంటింటికి వెళ్లి స్థానికులతో మాట్లాడిన మేయర్ వారి సమస్యలు, అవసరాలు, అభివృద్ధి పనులపై అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. పర్యటన సందర్భంగా కాలనీల్లోని డ్రైనేజీ వ్యవస్థ, మంచినీటి సరఫరా, రోడ్ల పరిస్థితి, పారిశుద్ధ్య నిర్వహణ, వీధి దీపాలు ఇతర మౌలిక సదుపాయాలను పరిశీలించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే గుర్తించి వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
అత్యవసర సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించి ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ఈ సందర్భంగా మేయర్ కూరగాయల ఉమారాణి మాట్లాడుతూ.. నగరంలోని ప్రతి డివిజన్ అభివృద్ధి చెందడమే నిజమైన నగరాభివృద్ధి అని పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండే ప్రజాప్రతినిధిగా వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని పరిష్కరించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. నగర ప్రజలకు నాణ్యమైన మౌలిక వసతులు, పరిశుభ్రమైన వాతావరణం, మెరుగైన పౌర సేవలు అందించేందుకు నగర పాలక సంస్థ నిరంతరం కృషి చేస్తోందన్నారు. ప్రజల సంక్షేమం, నగరాభివృద్ధి కోసం అధికారులు సమన్వయంతో పనిచేయాలని, పనుల్లో నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రణాళికాబద్ధంగా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ పర్యటనలో స్థానిక కార్పొరేటర్ గారు, మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్, ఏఎంసీ నజీర్, ఏఈ ఇనాయత్ కరీం , మున్సిపల్ జవాన్లు, మున్సిపల్ సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. నగరాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంలో మేయర్ చొరవను కాలనీవాసులు అభినందించారు.




