నాలా పనులపై గూగుల్‌ మీట్‌లో మేయర్‌ సమీక్ష

నవతెలంగాణ-సిటీబ్యూరో
వర్షాకాలంలోపు ఎస్‌.ఎన్‌.డీ.పీ. ద్వారా నాలా పనులు వేగవంతంగా పూర్తి చేయాలని జోనల్‌ కమిషనర్‌లకు నగర మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి ఆదేశాలు జారీచేశారు. వచ్చే వర్షాకాలానికి ముందుగానే అసంపూర్తిగా ఉన్న నాలా పనులను వేగవంతంగా పూర్తి చేసేందుకు జోనల్‌ కమిషనర్‌, ఎస్‌.ఇ సికింద్రాబాద్‌ చర్యలు తీసుకోవాలని తెలిపారు. సోమవారం మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి జోనల్‌ కమిషనర్‌లతో నాలా పనులపై గూగుల్‌ మీట్‌ ద్వారా సమీక్షించారు. నల్లకుంట పద్మ కాలనీలో మూసి నాలా రిటైనింగ్‌ వాల్‌ కూలిపో వడంతో అక్కడ పది రోజులలో పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. ఇలాంటి సంఘటనలు పునరావతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పద్మ కాలనీ, వెజిటేబుల్‌ మార్కెట్‌, ఓల్డ్‌ రామాలయం, ఫీవర్‌ హాస్పిటల్‌ గుండా నాలా ప్రవహిస్తుందని, నాగమయ్య కుంట నుండి పద్మ కాలనీ వద్ద ఏర్పాటు చేసిన రిటైనింగ్‌ వాల్‌ ప్రతి సంవత్సరం వరదలతో దెబ్బతిం టుంది. ఈ దెబ్బతిన్న వాల్‌ రీ-కన్స్ట్రక్షన్‌ కోసం డీ-సిల్టింగ్‌ అనంతరం పూర్తి చేయాలని మేయర్‌ అధికారులను ఆదేశించారు. అకాల వర్షాల వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు. నాలా పనులను అధికారులతో ప్రతి రోజు రివ్యూ చేస్తూ నిర్దేశిత సమయానికి ముందే పూర్తి చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా సంబంధిత జోనల్‌ కమిషనర్‌ పనులపై మేయర్‌కు వివరించారు. ప్రతి రోజు ఎస్‌.ఎన్‌.డీ.పీ వర్క్స్‌, ఫిర్యాదులపై గూగుల్‌ మీట్‌, కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తామని మేయర్‌ తెలిపారు.

Spread the love