మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ చిత్రంపై మెగాస్టార్ రివ్యూ

నవతెలంగాణ – హైదరాబాద్: అనుష్క శెట్టి, నవీన్ పొలిశెట్టి నటించిన వినోదాత్మక చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి. మహేశ్ బాబు పచ్చిగొల్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబరు 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా, ఈ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా వీక్షించారు. అనంతరం ఈ చిత్రంపై తన అభిప్రాయాలను ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నారు. “మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా చూశాను. మొదటి నుంచి చివరి వరకు ఎంతగానో ఆకట్టుకుంది. కడుపుబ్బా నవ్వించే వినోదభరిత చిత్రం ఇది. ప్రస్తుత యువత ఆలోచన తీరును ప్రతిబింబిస్తూ తీసుకున్న సరికొత్త కథాంశం. ‘జాతిరత్నాలు’ చిత్రానికి రెట్టింపు ఎనర్జీని, వినోదాన్ని అందజేసిన నవీన్ పొలిశెట్టి, కొంచెం గ్యాప్ తీసుకున్న తర్వాత మరింత అందంగా ఉన్న మనందరి ‘దేవసేన’ అనుష్క శెట్టి ఈ చిత్రానికి ప్రాణం పోశారు. పూర్తిస్థాయి ఎంటర్టయినర్ అవడంతో పాటు భావోద్వేగాలను కూడా అద్భుతంగా మిక్స్ చేసి రక్తి కట్టించేలా రూపుదిద్దిన దర్శకుడు మహేశ్ బాబును అభినందించాల్సిందే. అన్నట్టు… ఈ చిత్రానికి నేనే తొలి ప్రేక్షకుడ్ని. ఆ హిలేరియస్ మూమెంట్స్ ను ఎంతో ఆస్వాదించాను. మరోసారి థియేటర్ లో ఆడియన్స్ తో కలిసి ఎంజాయ్ చేయాలన్న బలమైన కోరిక కలిగింది. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ప్రేక్షకులను వంద శాతం నవ్వుల బాట పట్టిస్తారనడంలో సందేహం లేదు” అంటూ చిరంజీవి పేర్కొన్నారు. ఈ మేరకు మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి చిత్రబృందం తనను కలిసినప్పటి ఫొటోలను కూడా పంచుకున్నారు

Spread the love