జారుడు మెట్లపై మానసిక ఆరోగ్యం

Mental health on a slippery slopeరష్యా – ఉక్రేయిన్‌ యుద్దం కొనసాగు తునే ఉన్నది. మరల తాజాగా ఇజ్రాయిల్‌ – పాలస్తీనా యుద్దం మొదలైంది. బాంబులు క్షిపణుల దాడులకు ఆ యుద్ధజ్వాలల్లో వేలాది మంది అమాయకులు బలైపోతున్నారు. మరోపక్క ఆప్ఘనిస్తాన్‌లో అకస్మాత్తుగా సంభవించిన భూకంపానికి రెండు వేలమందికి పైగా మరణించారు. రెండుచోట్ల విధ్వంసమైన ఆ శిధిలాల కింద మరికొన్ని వేలమంది రక్తమోడుతూ క్షతగాత్రులై హాహాకారాలు చేస్తున్నారు. మనదేశంలో మణిపూర్‌ మారణహోమం మంటలు ఇంకా చల్లారనే లేదు.చుట్టు పక్కల ఇటువంటి భయానక ఉద్రిక్త పరిణామాలు ఉత్పన్నమైనప్పుడు. మీడియా ద్వారా ఆ కకావికల దృశ్యాలు చూస్తున్నవారికి, ఆ భీకర శబ్ధాలు వింటున్న వారికి మానసిక ప్రశాంతత అనేది ప్రశ్నార్ధకమే అవుతుంది. మానసిక స్వస్థత లేని జీవనయానం బ్రేకుల్లేని కారు వంటిదని నిపుణుల అభిప్రాయం.
ప్రపంచ వ్యాప్తంగా ప్రతి నలుగురిలో ఒకరికి నేడు మానసిక సంరక్షణ అవసరం అవుతున్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల తెలిపింది. ‘మానసిక ఆరోగ్యం అనేది విశ్వమానవ సార్వత్రిక హక్కు’. ఈ ఇతివృత్తంతోనే ఈ యేడు పని చేయాలని సంస్థ పిలుపునిచ్చింది.
గత ముప్పై ఏండ్లుగా ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రయివేటీకరణ విధానాలు తీవ్రంగా అమలవుతున్న ఫలితంగా ప్రపంచ మంతటా నేడు ఉపాధి రహిత అభివృద్ధి శరవేగంగా పరుచుకుంటున్నది. ఆ అభివృద్ధి మాటున ప్రకృతి పర్యావరణం విధ్వంసం జరుగుతున్న మాటా యధార్థమే. మధ్యలో వచ్చిన కరోనా మహమ్మారి దేశ దేశాలను అల్లకల్లోలం చేసింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మానసిక ఆరోగ్యానికి తగు ప్రాధాన్యతనీయకపోతే భవిష్యత్‌ మరింత అంధకార బంధురమవుతుందనేది సర్వత్రా ఆందోళన కలిగించే విషయం.
మారుతున్న ప్రపంచంలో యువత మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టకపోతే, ఆ ఆత్మహత్యల నివారణకు అడ్డుకట్ట వేయకపోతే, త్వరలో అంతర్గత శాంతి భద్రతలకు పెనుముప్పు వాటిల్లుతుందని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు.
ఆయా దేశాల ప్రభుత్వ విధానాలు, పాలనా చర్యలననుసరించే ప్రజల శారీరక, మానసిక ఆరోగ్యం ఆధారపడి ఉంటుందనేది కాదనలేని సత్యం. ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందిన అమెరికాలో సైతం నాలుగు కోట్ల మందికి పైగా ప్రజానీకం మానసిక అనారో గ్యంతో బాధపడుతున్నట్టు లెక్కలు చెబుతు న్నాయి. ముఖ్యంగా యువత నేడు ఉపాధి లేమితో కుంగుబాటుకు లోనవుతూ ఆత్మహత్య లకు చేరువ అవుతున్నది. నిరుద్యోగ పెను భూతం కారణంగా గడచిన పదేళ్లల్లో ఈ కుంగుబాటు శాతం 5.9 నుండి 8.2 శాతం పెరిగింది.
మానవుని ఆలోచన – ప్రవర్తనకు సంబంధించి మనో విజ్ఞాన శాస్త్రం నిత్యం అధ్యయనం చేస్తుంది. తత్సంబందిత మెదడు, నాడీమండల వ్యవస్థలు దెబ్బతిన్నప్పుడు, ఔషధాల ద్యారా, కౌన్సిలింగ్స్‌ ద్వారా చికిత్స చేయడానికి ప్రయత్నిస్తుంది. తగు ఆత్మస్థైర్యాన్ని కలిగించి, జీవితంలో ముందుకు సాగడానికి ఉపకరిస్తుంది. మానసిక ఆరోగ్యం కూడా శారీరక ఆరోగ్యం వంటిదే. ప్రాపంచిక అవగాహన లోపించి తనకు తాను పరిమితమై సంకుచితంగా ఒంటరిగా లోలోలపలకు ముడుచుకుపోతున్న కొద్దీ మనిషి మానసిక రుగ్మతకు చేరువ అవుతాడని శాస్త్రజ్ఞులు చెపుతున్నారు.
మానసిక వికాసం పెంపొందే రీతిలో మన విద్యావ్యవస్థ లేక పోవడం ఒక ప్రధాన లోపం. దేవుడు-దెయ్యాలు, క్షుద్ర పూజలు, వాస్తు, జ్యోతిష్యం వంటి అశాస్త్రీయ పద్ధతులను చాలా విద్యాల యాలు ఇప్పటికీ పెంచి పోషిస్తున్నాయి. నూతన విద్యా విధానం దీనిని బలపరుస్తున్నది. అలాగే కెరీర్‌ ఓరెంటెడ్‌గా సాగే పరీక్షల ర్యాంక్‌రేస్‌ ఒత్తిడి కూడా విద్యార్థులను విపరీతమైన కుంగుబాటుకు గురిచేస్తున్న విషయం తెలిసిందే. చదువులా – చావులా?అనే పరిస్థితీ వచ్చింది. దీనికి తోడు ఎక్కడబడితే అక్కడ విచ్చలవిడిగా డ్రగ్స్‌, మద్యం, మత్తుపదార్థాల వాడకం పెరుగుతున్నది. సహేతుకంగా ఆలోచించే వాతావరణానికే యువత దూరమైపోతున్నది. యంగ్‌ ఇండియాను డ్రగ్స్‌ ఇండియాగా మార్చే మాఫియా కుట్రలు పెచ్చరిల్లుతున్నాయి. కాగా, రోజుకు సగటున రెండు గంటలు పైనే సెల్‌ఫోన్‌ వాడకంలో యువత గడుపుతున్నది. నెట్‌ను అసభ్య, అశ్లీల పోర్న్‌కల్చర్‌ (బూతుచిత్రాలు)కు, ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లకు ఉపయోగించడం ఓ రివాజుగా మారింది.
ఈ పరిస్థితుల్లో మానసికశాంతికి కరువయ్యే జారుడుమెట్లపై యువత నడక ఉంటున్నది. మానసిక రోగుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం 2017లో ‘మెంటల్‌ హెల్త్‌కేర్‌ యాక్ట్‌’ అనే కొత్త చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. దేశంలో మానసిక వైద్యం అవసరమైన ప్రతి వ్యక్తికి చికిత్స చేయించి, ఆ ఖర్చును భరించాల్సిన భాద్యత ఆయా ప్రభుత్వాలదేనని చట్టం చెప్తున్నది. అన్ని చట్టాల మాదిరిగానే ఇది కూడా అమలు అయ్యేది నామమాత్రం.
అలాగే ఎలాంటి ఆలనా పాలనా లేని అనాధ మానసిక రోగులను కూడా చేరదీసి వైద్యం చేయించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలదే. అయితే ఇటీవల ఈ అనాథ మానసిక రోగుల్లో చదువుకున్న యువత కూడా పెద్ద సంఖ్యలో చేరడం పై పరిస్థితులకు అద్దం పడుతున్నది.
– శైలి, 9959745723

Spread the love