ఎంఈవోలు కావలెను..!

– జిల్లా భారమంతా డీఈఓపైనే..!
– మండల విద్యాధికారి పోస్టులన్నీ ఖాళీ
– 15 మండలాలకు ఇద్దరే ఇన్‌చార్జి ఎంఈవోలు
– సీెనియర్‌ హెచ్‌ఎంలకే అన్నింటి బాధ్యతలు
– పెర్యవేక్షణ కొరవడి పడిపోతున్న విద్యా ప్రమాణాలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో ఒక్కరూ రెగ్యులర్‌ ఎంఈవో లేరు. ఏండ్ల తరబడి ఇన్‌చార్జీలతోనే నెట్టుకొస్తు న్నారు. ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకే ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించి కొనసాగిస్తున్నారు. వారు తాము పని చేస్తున్న పాఠశాలల కార్యకలాపాలతో పాటు ఇతర మండలాల్లోని పాఠశాలలను పర్యవేక్షించాల్సి వస్తోం ది. ఒకరికి ఏడు, మరొకరికి ఎనిమిది మండలాల బాధ్యతలను అప్పగించారు. దీంతో పాఠశాలలపై పర్యవేక్షణ కొరవడి విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయి. ఇటీవల వెల్లడైన పదో తరగతి ఫలితాలే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. పదో తరగతి ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలో 26వ స్థానంతో సరి పెట్టుకుంది.
ఒకరికి ఏడు, మరొకరికి 8 మండలాలు
జిల్లాలోని 15 మండలాలకు ఇద్దరు ఇన్‌చార్జి ఎంఈవోలు ఉన్నారు. వీరిలో ఒకరికి ఊడు, మరొకరికి ఎనిమిది మండలాల చొప్పున బాధ్యతలు అప్పగించారు. దీంతో వారు అటు పాఠశాలలకు వెళ్లలేక, ఇటు మండల విద్యాశాఖ బాధ్యతలు చూడలేక సతమతమవుతున్నారు.
స్కూలు ఈ చివర..
ఇన్‌చార్జి మండలం ఆ చివర..
శామిర్‌పేటకు చెందిన ఓ ఇన్‌చార్జి ఎంఈవోకు మేడ్చల్‌, శామిర్‌పేట, మూడుచింతలపల్లి, కుత్బుల్లాపూర్‌, కూకట్‌పల్లి, బాలానగర్‌, దుండిగల్‌, బాచుపల్లి.. ఎనిమిది మండలాల బాధ్యతలను అప్పగించారు. ఎనిమిది మండలాల విద్యాశాఖ బాధ్యతలు చూడలేక నానా అవస్థ పడుతున్నారు. కీసరకు చెందిన ఓ ఇన్‌చార్జి ఎంఈవోకు కీసర, మేడిపల్లి, ఘట్‌కేసర్‌, అల్వాల్‌, ఉప్పల్‌, కాప్రా, మల్కాజిగిరి మండలాల బాధ్యతలను అప్పగించారు. తాము హెచ్‌ఎంగా పనిచేసే పాఠశాల పర్యవేక్షణతోపాటు పదుల కిలోమీటర్ల దూరంలో ఉన్న మండలాల్లోని పాఠశాలల పర్యవేక్షణ ఎంతో కష్టంగా ఉంటుంది.
బోధనకు సమయమేదీ..?
పాఠశాలల నిర్వహణ తీరు, ఉపాధ్యాయుల సమయపాలన, విద్యాబోధన, వసతుల కల్పన, మధ్యాహ్న భోజన అమలు తదితర విషయాలను మండల విద్యాశాఖ అధికారులు పర్యవేక్షించాల్సి ఉంది. ముఖ్యంగా విద్యా ప్రమాణాలు పెంచి ఉత్తమ ఫలితాలు సాధించేందుకు వీరి పర్యవేక్షణ తప్పనిసరి. అయితే ఇన్‌చార్జి ఎంఈవోలకు ఈ అదనపు బాధ్యతలు గుదిబండలా మారాయి. తాము పనిచేస్తున్న పాఠశాలల్లో హెచ్‌ఎంలుగా పూర్తిస్థా యిలో దృష్టి పెట్టలేకపోతున్నారు. ఇన్‌చార్జి ఎంఈవోలుగా రోజువారీ రిపోర్టులపై సంతకాలు, మధ్యాహ్న భోజన పథకం బిల్లులు, ఉపాధ్యాయుల ఇంక్రిమెంట్ల వంటి వాటితోనే సమయం గడిచిపోతోంది. విద్యాబోధన తీరుపై దృష్టి పెట్టేందుకు సమయం ఉండటం లేదు. దీంతో విద్యాశాఖ పనితీరు గాడి తప్పి ఫలితాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇన్‌చార్జి ఎంఈవోలకు పనిభారం పెరుగుతుండగా, కొన్ని పనులను కాంప్లెక్స్‌ హెచ్‌ఎంలు నిర్వర్తిస్తున్నారు. ఎంఈవోల భర్తీ ప్రక్రియకు సంబంధించి సుప్రీంకోర్టులో కేసులున్నందున ఇన్‌చార్జి ఎంఈవోలతోనే కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితి నెలకొంది.
భారమంతా డీఈవోపైనే..
రెగ్యులర్‌ ఎంఈవోలు లేకపోవడంతో పాఠశాల నిర్వహణ భారమంతా డీఈవోపైనే పడుతోంది. ఇన్‌చార్జి ఎంఈవోలు ఉన్నా.. పని ఒత్తిడి, అదనపు బాధ్యతల కారణంగా పర్యవేక్షణ పెద్దగా ఉండటం లేదు. దీనికితోడు ప్రస్తుతం ఉపాధ్యాయుల బదిలీలు, అమ్మ ఆదర్శ పాఠశాలల పనితీరు, మధ్యాహ్న భోజనం టెండర్లు వంటి పనులు కూడా తోడవ్వడంతో డీఈవో అధిక పని భారంతో సతమతం అవుతున్నారు.

ఎంఈవో పోస్టులను వెంటనే భర్తీ చేయాలి
ప్రభుత్వం చొరవ తీసుకుని జిల్లా వ్యాప్తంగా ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. ఇన్‌చార్జి ఎంఈవోలు సైతం సరిపడా లేకపోవడంతో ప్రయివేటు, కార్పొరేట్‌ విద్యా సంస్థల దోపిడీని అరికట్టలేకపోతున్నారు. పేద, మధ్య తరగతి, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్య అందడం లేదు. ఎంఈవోల పోస్టులను భర్తీ చేసి మండలాల వారీగా ప్రభుత్వ, ప్రయివేటు, కార్పొరేట్‌ విద్యా సంస్థలపై ప్రత్యేక దృష్టి సారించాలి.
-రాథోడ్‌ సంతోష్‌, ఎస్‌ఎఫ్‌ఐ, మేడ్చల్‌-మల్కాజిగిరి
జిల్లా కార్యదర్శి

Spread the love