నవతెలంగాణ-హైదరాబాద్: పలు రోజుల నుంచి భానుడు ఉగ్రరూపం దాల్చిన విషయం తెలిసిందే. అర్ధ సెంచరీకి చేరువలో ఎండలు మండిపోయ్యాయి. ఎండల తీవ్రతకు జనాలు అల్లాడిపోయారు. మంగళవారం అర్ధరాత్రి గురిసిన వర్షాలకు ఒక్కసారిగా నగరం చల్లడిపోయింది. ఉదయం ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది.
తూర్పు హైదరాబాద్ పరిధిలోని కాప్రా, అల్వాల్, సికింద్రాబాద్, ఉస్మానియా యూనివర్సిటీ (OU) మీదుగా ఎల్బీ నగర్, మలక్‌పేట్, హయాత్‌నగర్ వరకు పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. కాగా, ఉత్తర హైదరాబాద్ ప్రాంతాలకు వాతావరణ శాఖ భారీ ఉరుములతో కూడిన వర్షాల హెచ్చరికను జారీ చేసింది. మేడ్చల్, జీడిమెట్ల, గాజులరామారం, కుత్బుల్లాపూర్, అల్వాల్, నిజాంపేట్, బాచుపల్లి, కూకట్‌పల్లి, బాలానగర్, మల్కాజ్‌గిరి, బోయిన్‌పల్లి, సుచిత్ర, శేరిలింగంపల్లి ప్రాంతాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. తీవ్రమైన ఉరుములు, మెరుపులు, గంటకు 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీయడంతో పాటు, పిడుగులు పడే అవకాశం ఉందని HMD అధికారులు హెచ్చరించారు.



