సిద్దిపేట‌లో మెగా జాబ్ మేళాను ప్రారంభించిన మంత్రి హ‌రీశ్‌రావు

నవతెలంగాణ – సిద్దిపేట: సిద్దిపేట బిడ్డలకు సిద్ధిపేటలోనే ఉద్యోగాలు చేసే అవకాశం రావడం సంతోషం అని రాష్ట్ర ఆర్థిక మంత్రి హ‌రీశ్ రావు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్, ఐటీ మంత్రి కేటీఆర్ చొరవ తీసుకుని జిల్లాలోనే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారని తెలిపారు. జిల్లా కేంద్రమైన సిద్దిపేట పోలీసు కన్వెన్షన్ సెంటర్‌లో స్థానికులకే స్థానిక ఉద్యోగాలు పేరిట ప్రముఖ 15 ఐటీ కంపెనీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి మంత్రి హ‌రీశ్‌రావు మంగ‌ళ‌వారం ఉద‌యం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హ‌రీశ్‌రావు మాట్లాడుతూ… కొత్త జిల్లాలు ఏర్పాటు కావడంతో జిల్లా కేంద్రమైన సిద్దిపేటకు ఐటీ టవర్ రావడం సంతోషంగా ఉంద‌ని తెలిపారు. మీ జీవితంలో అనుకున్న లక్ష్యాలను చేరాలని, గతంలో ఏం చేశారనే-గ్యాప్ ఎందుకుందనే అంశం ఐటీ సెక్టారులో అడిగే ఆస్కారం ఉన్నందున ముందు ఈ ఐటీ హబ్‌లో ఉద్యోగ అవకాశం పొందితే మీ కెరీర్ గ్యాప్ లేకుండా ఉంటుందని మంత్రి చెప్పుకొచ్చారు. సిద్దిపేటలో సైతం 718 సీటింగ్ కెపాసిటీతో నిర్మించిన ఐటీ టవర్‌లో ప్రముఖ ఐటీ కంపెనీలు భాగస్వామ్యం కావడం సంతోషకరంగా ఉన్నద‌ని మంత్రి హ‌రీశ్‌రావు తెలిపారు. రూ.63 కోట్ల వ్యయంతో సిద్దిపేటలో ఐటీ టవర్ నిర్మాణం చేపట్టినట్లు, ఈ నెల 15వ తేదీన ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. వీటిలో ఓఎస్ఐ డిజిటల్, జోలాన్ టెక్, విసన్ ఇన్ఫో టెక్, అమిడాయ్ ఎడ్యుటెక్, ఫిక్సిటీ టెక్నాలజీస్, ఇన్నోసోల్, థోరాన్ టెక్నాలజీస్, బీసీడీసీ క్లౌడ్ సెంటర్స్, ర్యాంక్ ఐటీ సర్వీసెస్, తదితర కంపెనీలు స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు ఆయా కంపెనీల ప్రతినిధులకు మంత్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Spread the love