మల్లన్నను దర్శించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్‌

మల్లన్నను దర్శించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్‌– పట్నం వేసి మొక్కులు చెల్లించుకున్న మంత్రి
నవతెలంగాణ-కొమురవెల్లి
కొమురవెల్లి మల్లికార్జున స్వామిని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ గౌడ్‌ కుటుంబ సమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. బోనాలు చెల్లించి ఆలయ ముఖ మండపంలో పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు ఆయనకు మల్లన్న ప్రతిమ, తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం గెస్ట్‌ హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొమురవెల్లి మల్లన్న తమ కుటుంబ ఇలవేల్పుగా కొలుస్తామని, ప్రతేడాది బోనాలు చెల్లించి పట్నాలు వేసి మొక్కులు తీర్చుకుంటామన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు మల్లన్న ఆలయానికి వచ్చి తాను ఎమ్మెల్యేగా గెలవాలని, రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావాలని మొక్కుకున్నానన్నారు. ఆ కోరికలు నెరవేరిన సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నానని తెలిపారు. రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురిసి పాడిపంటలతో రైతులు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్టు చెప్పారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్సీ నాగపురి రాజలింగం, ఆలయ పునరుద్ధరణ కమిటీ చైర్మెన్‌ పర్పాటకం లక్ష్మారెడ్డి, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love