మంత్రి సబితా గన్‌మెన్‌ ఆత్మహత్య

మంత్రి సబితా గన్‌మెన్‌ ఆత్మహత్య– ఆర్థిక ఇబ్బందులే కారణం..?
నవ తెలంగాణ- జూబ్లీహిల్స్‌
మంత్రి సబితా ఇంద్రారెడ్డి గన్‌మెన్‌ ఏఎస్‌ఐ ఫాజల్‌ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్‌ శ్రీనగర్‌ కాలనీలోని మణికంఠ హౌటల్లో ఆదివారం జరిగింది. ఆర్ధిక ఇబ్బందులే ఆత్మహత్యకు గల కారణాలుగా అనుమానిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న జూబ్లీహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ రవీంద్ర ప్రసాద్‌, ఎస్‌ఐ చంద్రశేఖర్‌ పోలీసు ఉన్నతాధికారులు ఆత్మహత్యకు గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గన్‌మెన్‌ ఏఎస్‌ఐ ఫాజిల్‌కు ఇద్దరు కూతుర్లు ఉన్నారని, వారి వివాహాలకు అయిన అప్పులతో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారని తెలిపారు. దాంతో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో రుణం కోసం దరఖాస్తు చేసుకున్నారని, గతంలో ఉన్న లోను క్లియర్‌ చేస్తే రూ.10 లక్షల లోన్‌ ఇస్తామని చెప్పి రూ.3లక్షలు కట్టించుకొని, ఆ తర్వాత తనకు సర్వీస్‌ తక్కువగా ఉందని, లోనివ్వటం కుదరదని బ్యాంకు సిబ్బంది చెప్పటంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిపారు. అనంతరం జూబ్లీహిల్స్‌ పోలీసులు మృతదేహాన్ని పోస్‌మార్డం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

Spread the love