మోడీది పదేండ్ల నయవంచన

Modi is a hypocrite for ten years– నియంతృత్వం రాదని.. నియంత చెబితే నమ్మాలా?
– మోడీ చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలే
– ప్రజల మధ్య చిచ్చు పెట్టి ఓట్లు దండుకోవాలనే కుట్ర
– ‘విద్వేశ గురు’గా మారుతున్న వైనాన్ని గమనిస్తున్న ప్రజలు
– ‘నయవంచన పదేండ్ల నిరంకుశ పాలన- పది దారుణ మోసాలు’ బుక్‌లెట్‌ ఆవిష్కరణలో వక్తలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
‘ప్రధాని మోడీ పదేండ్ల పాలన దేశ ప్రజలను వంచనకు గురిచేస్తున్నది. అబద్ధాలు చెప్పీ..చెప్పి అవే నిజాలుగా నమ్మే పరిస్థితిని మోడీ కల్పిస్తున్నారు. ప్రశ్నించే గొంతుకలపై జులుం చేస్తున్న దృశ్యాలు దేశమంతటా కనిపిస్తున్నాయి. ఈ దౌర్జన్యాలు రోజురోజుకూ పరాకాష్టకు చేరుతున్నాయి. కాకతీయ యూనివర్శిటీలో సెక్యులర్‌ రైటర్స్‌ ఫోరంపై దాడి ఘటనే ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం. ఎన్నికలొస్తే..సెంటిమెంట్‌, వైషమ్యాలను రెచ్చగొట్టి గెలవాలనే యావ తప్పితే.. ప్రజలకు మేలు చేయాలన్న సోయి కించిత్తు లేకపోవటం బాధాకరం. సంఫ్‌ు పరివారమంతా మోడీని విశ్వగురుగా ప్రచారం చేశారు. కానీ.. ఆయన ఇప్పుడు విద్వేశ గురుగా అవతారం ఎత్తుతున్నాడు. ఈ మార్పు ప్రజాస్వామిక, లౌకిక శక్తులకు మరింత ఆందోళన కలిగిస్తున్నది. ప్రశ్నించిన వారిని ప్రభుత్వ సంస్థలను వినియోగించి బీజేపీ ప్రభుత్వం నిర్బంధానికి గురిచేస్తున్నది. ప్రతి పక్షాలను బెదిరిస్తున్నది. రాష్ట్రాల హక్కులను నిరాకరించి, ఫెడరల్‌ వ్యవస్థపైనా దాడిని సాగిస్తున్నది. రాష్ట్రానికి సంబంధించిన విభజన హామీలను ఏ ఒక్కటీ నెరవేర్చలేదు’ అని వక్తలు విమర్శించారు.
రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లో ‘నయవంచన పదిసంవత్సరాల నిరంకుశపాలన పది దారుణ మోసాలు’ అనే బుక్‌లెట్‌ను సుందరయ్య విజ్ఞాన కేంద్రం ట్రస్ట్‌ కార్యదర్శి ఎస్‌ వినరుకుమార్‌, వ్యవసాయ రంగ నిపుణులు ప్రొఫెసర్‌ అరిబండి ప్రసాదరావు, తెలంగాణ సాహితీ కార్యదర్శి కె ఆనందాచారితో కలిసి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ నయవంచనే కాదు.. నయావంచనతో అందరినీ భయపట్టేలా మోడీ పరివారం వ్యవహరిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. వారి వక్రమైన విషయాలను, చర్యలను ప్రజల్లో ఎండగట్టాల్సిన పరిస్థితి పెరిగిందన్నారు. భయపెట్టి, ఆశపెట్టి, ఆందోళనకు గురిచేసి పక్కదోవ పట్టిస్తున్న తీరును ప్రజలకు అర్థం చేయించాల్సిన అవసరముందన్నారు. రాజ్యాంగాన్ని రక్షించుకోవటమంటే.. పౌరుల భద్రత, వారి స్వేచ్ఛను రక్షించటమేనని చెప్పారు. మోడీ మాత్రం ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి ఎలాంటి ఢోకా లేదని అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. నియంతృత్వం రాదని ఒక నియంత చెబితే ఎలా నమ్మాలని ఎద్దేవా చేశారు. నేను చెప్పిందే వేదం, నామాటే శాసనం అంటూ శివగామిలా చెబితే.. అది ప్రజాస్వామ్యం ఎలా అవుతుందని ప్రశ్నించారు. వినరుకుమార్‌ మాట్లాడుతూ ఇంత పిరికి ప్రధానిని తానెప్పుడూ చూడలేదన్నారు. పదేండ్లలో కనీసం ఒక్క విలేకర్ల సమావేశాన్ని నిర్వహించని ప్రధాని ఎవరైనా ఉన్నారా అంటే ఠక్కున మోడీ పేరే చెప్పొచ్చన్నారు. గత ప్రధానులు మీడియాను తమ వెంట తీసుకెళ్లేవారని గుర్తు చేశారు. కానీ.. మోడీ మాత్రం అదానీ, అంబానీలను తీసుకెళ్తున్నారని ఎద్దేవా చేశారు. అరిబండి ప్రసాద్‌ మాట్లాడుతూ పదేండ్లలో ట్రైలర్‌ మాత్రమే చూశారనీ.. అసలు సినిమా ముందుందని చెప్ప టంలో అర్థమేంటని ప్రశ్నించారు. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా కార్పొరేటీకరణ చేసిన తర్వాత రైతుకు మిగిలేదేమీ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్ల పాలనలో హక్కులుండబోవని ఆందోళన వ్యక్తం చేశారు. ఆనందాచారి మాట్లాడుతూ ప్రస్తుతం వాస్తవాలను కూడా ప్రచారంలోకి తీసుకెళ్లాల్సిన అగత్యం ఏర్పడిందని చెప్పారు. ఎందుకంటే.. అబద్ధాలే నిజాలుగా ప్రచారంలో ఉంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముస్లింలపై విద్వేషాన్ని రెచ్చగొట్టే స్థితి రోజు రోజుకు పెరుగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. 75ఏండ్ల స్వతంత్ర భారతంలో ఇన్ని అబద్ధాలు చెప్పే ప్రధాని ఎవరూ లేరని వివరించారు. ఎన్నికల సందర్భంలో తెలంగాణకు ఏం చేయబోతున్నాం..ఏం చేశామో చర్చ జరగాలని సూచించారు. ఈ కార్యక్రమానికి రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక నాయకులు ఉమా మహేశ్వరరావు అధ్యక్షత వహించగా కేవీఎస్‌ఎన్‌ రాజు వందన సమర్పణ చేశారు.

Spread the love