మోడీ కో హటావో.. సెక్యులరిజం బచావో

 Modi ko hatao.. Secularism Bachao– కమలం, కారు దోస్తులే
– మోడీని, ఆయన దోస్తుల్ని ఇంటికి పంపాలి
– ప్రభుత్వ రంగ సంస్థలను నిర్మించింది కాంగ్రెస్సే
– భూ సంస్కరణల ఘనత ఇందిరాగాంధీదే : కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున్‌ ఖర్గే
– చేవెళ్ల ప్రజాగర్జన సభలో 12 ఆంశాలతో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న మోడీ ప్రభుత్వాన్ని కూలదోసి.. సెక్యులర్‌ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని, మోడీని, మోడీ ప్రభుత్వానికి సపోర్టు చేస్తున్న పార్టీలను తరిమికొట్టాలని ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌లో ప్రకటించిన 12 హామీలను అమలు చేస్తామని స్పష్టం చేశారు. శనివారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల కేవీఆర్‌ గ్రౌండ్‌లో రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చల్లా నర్సింహారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ పార్టీ ప్రజాగర్జన సభకు ఖర్గే ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ముందుగా గద్దర్‌ చిత్రపటానికి ఖర్గే పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ దళిత, గిరిజన సాధికారత, సమగ్ర అభివృద్ధికై 12 అంశాలతో కూడిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ను టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. అనంతరం ఖర్గే మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పాలనలో తీసుకొచ్చిన ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్ముతూ.. దేశంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏమీ చేసిందని మోడీ, షాలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో గుండు సూది నుంచి అంతరిక్షంలో ఎగిరే రాకెట్‌ సంస్థలను స్థాపించింది కాంగ్రెస్‌ ప్రభుత్వమని తెలిపారు. దశాబ్దాలపాటు పాలించిన కాంగ్రెసేతర ఫ్రభత్వాలు దేశానికి ఏం చేశాయని నిలదీశారు. నెహ్రు, పటేల్‌ కలిసి చిన్న చిన్న రాజ్యాలను ఏకం చేశారని గుర్తు చేశారు. 53 ఏండ్ల కాంగ్రెస్‌ పరిపాలనలో దేశాన్ని బలోపేతం చేశామని గుర్తుచేశారు.
తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులను ఎవరు నిర్మించారని నిలదీశారు. నాగార్జు సాగర్‌ ప్రాజెక్టు చేపట్టింది కాంగ్రెస్‌ కాదా అని ప్రశ్నించారు. పేదల ఆకలి తీర్చేందుకు ఆహార భద్రతా చట్టాన్ని తామే తెచ్చామని తెలిపారు. భూ సంస్కరణలు అమలు చేసి జమీందారీ వ్యవస్థను నిషేదించామన్నారు. బ్యాంకులను జాతీయం చేసింది కాంగ్రెస్సేనని తెలిపారు. హరిత విప్లవం, శ్వేత విప్ల్లవం కాంగ్రెస్‌ హయంలోనే వచ్చాయన్నారు.
మేం చేపట్టిన కార్యక్రమాల వల్లే మహిళా అక్షరాస్యత 65 శాతమైందన్నారు. విద్యా, వైద్య రంగాల్లో అనేక సంస్కరణలు చేపట్టింది కాంగ్రెస్సేనని స్పష్టంచేశారు. దేశాన్ని ఐక్యంగా ఉంచడమే కాంగ్రెస్‌ సిద్దాంతమని, దాని కోసం ఇందిర, రాజీవ్‌ ప్రాణాలు వదిలారని గుర్తుచేశారు. తెలంగాణలో కేసీఆర్‌ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ప్రజలు సిద్దమయ్యారన్నారు. తెలంగాణ కోసం అన్ని వర్గాల ప్రజలు పోరాటం చేస్తే.. తనవల్లే తెలంగాణ వచ్చిందని కేసీఆర్‌ చెబుతున్నారని విమర్శి ంచారు. సోనియాతో ఫొటో తీసుకుని బయటకు వచ్చి మాట మార్చారన్నారు. కేసీఆర్‌.. బయట బీజేపీని తిడతారు.. లోపల మంతనాలు జరుపుతా రని విమర్శించారు.

ఇవి డిక్లరేషన్‌లోని అంశాలు..

ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ను మల్లికార్జున ఖర్గే విడుదల చేయగా.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ప్రకటించారు.
1. ఎస్సీ రిజర్వేషన్ల పెంపు – ఎస్సీ వర్గీకరణ:
జనాభా దామాషా ప్రకారం ఎస్సీల రిజర్వేషన్లు 18శాతానికి పెంపు. ఎస్సీ రిజర్వేషన్లలో ఏ, బి, సి, డి వర్గీకరణ అమలుకు నిర్ణయం
2. అంబేద్కర్‌ అభయ హస్తం:
ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ.12 లక్షల ఆర్థిక సాయం అందజేత. వచ్చే ఐదేండ్లలో ప్రతి బడ్జెట్లోనూ సరిపడా నిధులు కేటాయించి, పూర్తి స్థాయిలో పథకం అమలు.
3. ప్రత్యేక రిజర్వేషన్లు:
ప్రభుత్వ ప్రొక్యూర్‌మెంట్‌ అన్ని కాంట్రాక్టుల్లో ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లు. ప్రయివేట్‌ విద్యాసంస్థల్లో, ప్రభుత్వ ప్రోత్సాహకాలు పొందే ప్రయివేట్‌ కంపెనీల్లో రిజర్వేషన్ల కల్పన.
4. ఇందిరమ్మ పక్కా ఇండ్ల పథకం:
ఇల్లు లేని ప్రతి ఎస్సీ, ఎస్టీ కుటుంబానికీ ఇంటి స్థలంతో పాటు నిర్మాణానికి రూ.6 లక్షలు అందజేత. ఐదేండ్లలో అర్హులైన ప్రతి కుటుంబానికీ వర్తింపు.
5. అసైన్డ్‌ భూముల పునరుద్ధరణ – సమాన హక్కులు
బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గుంజుకున్న ఎస్సీ, ఎస్టీల అసైన్డ్‌ భూములను తిరిగి వారికే అన్ని హక్కులతో పునరుద్ధరణ. ప్రజా ప్రయోజనార్థం, భూసేకరణ చట్టం 2013 ప్రకారం భూములను సేకరించినప్పుడు, అసైన్డ్‌ భూములకు పట్టా భూములతో సమానంగా పరిహారం.
6. పోడు పట్టాల పంపిణీ :
సోనియా గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్‌ తెచ్చిన అటవీ హక్కుల చట్టాన్ని పటిష్టంగా అమలు చేసి, అర్హులైన అందరికీ పోడు భూముల పట్టాలు పంపిణీ.
7. సమ్మక్క సారక్క గిరిజన గ్రామీణాభివృద్ధి పథకం :
ఈ పథకం కింద ప్రతి గూడెం, తండా గ్రామ పంచాయతీలకు ఏటా రూ.25 లక్షల కేటాయింపు.
8. 3 ఎస్సీ కార్పొరేషన్ల ఏర్పాటు:
మాదిగ, మాల, ఇతర ఎస్సీ ఉపకులాలకు కొత్తగా 3 ఎస్సీ కార్పొరేషన్లను ఏర్పాటు చేసి, ప్రతి ఏడాదీ ఒక్కో కార్పొరేషన్‌కు రూ.750 కోట్లు మంజూరు.
9. 3 ఎస్టీ కార్పొరేషన్ల ఏర్పాటు:
తుకారాం ఆదివాసీ కార్పొరేషన్‌, సంత్‌ సేవాలాల్‌ లంబాడా కార్పొరేషన్‌, ఎరుకుల కార్పొరేషన్లను ఏర్పాటు చేసి, ప్రతి ఏడాదీ ఒక్కో కార్పొరేషన్‌కు రూ.500 కోట్లు మంజూరు.
10. 5 కొత్త ఐటీడీఏలు – 9 సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు:
మైదాన ప్రాంత ఎస్టీల కోసం నల్లగొండ, మహబూబాబాద్‌, ఖమ్మం, నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌లో 5 కొత్త ఐటీడీఏల ఏర్పాటు. అన్ని ఐటీడీఏ కేంద్రాల్లో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల స్థాపన.
11. విద్యా జ్యోతులు పథకం:
ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు పదవ తరగతి పాసైతే రూ.10,000, ఇంటర్‌ పాసైతే రూ.15,000, గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేస్తే రూ. 25,000, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేస్తే రూ.లక్ష.. ఎంఫిల్‌, పీహెచ్‌డీ పూర్తి చేసిన ఎస్సీ, ఎస్టీ యువతకు రూ.5 లక్షలు.
12. రెసిడెన్షియల్‌ స్కూళ్ళు, హాస్టల్స్‌, విదేశాల్లో విద్య:
ప్రతి మండలంలో ఒక గురుకులం ఉండేలా ఎస్సీ, ఎస్టీ రెసిడెన్షియల్‌ స్కూళ్ల ఏర్పాటు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని తిరిగి ప్రవేశపెట్టడంతో పాటు, గ్రాడ్యుయేషన్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చదివే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులందరికీ హాస్టల్‌ సదుపాయ కల్పన. విదేశాల్లోని యూనివర్సిటీల్లో ప్రవేశం పొందిన ప్రతి విద్యార్థికీ ఆర్థిక సహాయం.

Spread the love