– తెలంగాణకు ఆయన చేసిందేమీ లేదు
– పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్
నవతెలంగాణ-రామకృష్ణాపూర్ / మందమర్రి
ప్రధాని మోడీ మనసులో తెలంగాణ లేదని.. కేవలం ఆయన ఓట్ల కోసమే రాష్ట్ర పర్యటనకు వచ్చారని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) అన్నారు. గతంలో రామగుండంకు వచ్చిన మోడీ.. సింగరేణిలో ఉన్న నాలుగు బొగ్గు బ్లాకులను ప్రయివేటీకరించమని చెప్పి మరునాడే ఈ బ్లాకులను వేలం వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం మంచిర్యాల జిల్లా మందమర్రి, రామకృష్ణాపూర్ మండలాల్లో పర్యటించిన మంత్రి కేటీఆర్ రూ.312.96కోట్ల అభివృధ్ధి పనులను స్థానిక ఎమ్మెల్యే బాల్క సుమన్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం రామకృష్ణాపూర్‌లోని ఠాగూర్ స్టేడియంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఒక వైపు ఉంటే నికార్సైన బీఆర్‌ఎస్ నాయకులు మరోవైపు ఉన్నారని తెలిపారు. ప్రధాని మోడీ తెలంగాణకు ప్రత్యేకంగా చేసిందేమీ లేదని, ఆంధ్రాకు సైతం తట్టెడు మట్టి తప్ప ఇచ్చిందేమీ లేదని విమర్శించారు. కేంద్రంలో రాష్ట్రానికి చెందిన వారు మంత్రులుగా ఉన్నా ఇక్కడ ఏమీ వెలగబెట్టలేదని తెలిపారు. అరవై ఏండ్లలో జరగని అభివృధ్ధి కేవలం ఐదేండ్లలోనే బాల్క సుమన్ చేసి చూపించారని ప్రశంసించారు. వరి పంటలో పంజాబ్, హర్యానా కన్నా రాష్ట్రం ముందుందని, అలాగే ఆయిల్ పామ్ పంటలను (వంట నూనె) పండించి ఇతర దేశాలకు, రాష్ట్రాలకు తెలంగాణ ఎగుమతి చేయాలని ఆకాంక్షించారు. బాల్కసుమన్ అభ్యర్థన మేరకు చెన్నూరులో రూ.1658 కోట్లతో ఎత్తిపోతల పథకాన్ని త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. చెన్నూరును రెవెన్యూ డివిజన్‌గా, చెన్నూరు మండలంలోని పారుపల్లి, హస్నాద్ గ్రామాలకు నిధులను కేటాయించి నూతన మండలాలుగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రం ఏర్పడిన ఈ పదేండ్లలో సింగరేణి 32 శాతం లాభాల్లో నడుస్తోందన్నారు. దీపావళి బోనస్‌గా కార్మికుల ఖాతాలో రూ.1000 కోట్లు జమ చేసినట్టు తెలిపారు. ఎమ్మెల్యేగా ఉంటేనే ఇంత అభివృద్ధి జరిగింది అంటే కేసీఆర్ దీవెనతో మంత్రిగా అవకాశం వస్తే చెన్నూరు అభివృద్ధి మెదక్, గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లలను మించి పోతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో సైతం సుమన్‌ని భారీ మెజారిటీతో గెలిపించి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం సింగరేణి స్థలాల్లో ఇండ్లు నిర్మించుకున్న వారికి 7వ విడతగా జీఓ 76 ద్వాారా 304 మందికి ఇండ్ల పట్టాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత, మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ఆసిఫాబాద్ జడ్పీ చైర్మెన్ కోవలక్ష్మి, ఎమ్మెల్సీ దండే విఠల్, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్, జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్, తదితరులు పాల్గొన్నారు.