దేశం పేరు మార్చనున్న మోడీ..!

నవతెలంగాణ హైదరాబాద్:  జీ-20 సదస్సు కోసం రూపొందించిన బుక్‌లెట్‌లోనూ దేశం పేరు ‘భారత్‌’ అని పేర్కొన్నారు. ‘భారత్‌, మదర్‌ ఆఫ్‌ డెమోక్రసీ’ అని అందులో రాశారు. మరోవైపు  జీ-20 శిఖరాగ్ర సదస్సు జరగనుంది. ఈ సమావేశానికి ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల అధినేతలు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలోనే వీరికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సెప్టెంబరు 9వ తేదీన ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఇందుకోసం రాష్ట్రపతి భవన్‌ నుంచి ఇప్పటికే  ఆయా దేశాధినేతలకు ఆహ్వానం అందింది. అయితే, ఈ ఆహ్వానంపై  ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా` కు బదులుగా ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్` అని ముద్రించి ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో దేశం పేరు మార్పుపై ఊహాగానాలు జోరందుకున్నాయి. ఆంగ్లంలోనూ ‘ఇండియా’ నుంచి ‘భారత్‌’గా పేరు మారుస్తూ ప్రధాని మోడీ ప్రభుత్వం ప్రత్యేక తీర్మానం తీసుకురానున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నెల 18 నుంచి 22 మధ్య ఐదు రోజుల పాటు జరిగే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఈ ప్రతిపాదనలు తీసుకురానున్నట్టు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
మరోవైపు, మంగళవారం ఉదయం అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కూడా దీనిపై ఓ ట్వీట్ చేశారు. ‘‘రిపబ్లిక్‌ ఆఫ్‌ భారత్‌ – మన నాగరికత అమృత్‌కాల్‌ వైపు వేగంగా అడుగులు వేస్తుండటం గర్వంగా ఉంది’’ అని రాసుకొచ్చారు. దేశం పేరు మార్పుపై వస్తున్న ఊహాగానాలకు ఈ ట్వీట్‌ మరింత బలం చేకూర్చినట్లయింది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
కేంద్రంలోని అధికార ‘జాతీయ ప్రజాతంత్ర కూటమి’ (ఎన్డీయే)పై పోరుకు జట్టు కట్టిన విపక్షాలు తమ కూటమి పేరును ఇండియన్‌ నేషనల్‌ డెవలప్‌మెంటల్‌ ఇన్‌క్లూజివ్‌ అలయెన్స్‌ (ఐఎన్‌డీఐఏ- ఇండియా)గా ప్రకటించిన విషయం తెలిసిందే. దేశం పేరు మీదుగా తమ కూటమికి పేరు పెట్టుకోవడంపై అప్పట్లో బీజేపీ నేతల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆ తర్వాత దేశం పేరును ‘భారత్‌’ అని మార్చాలంటూ డిమాండ్లు కూడా వినిపించాయి. ఈ క్రమంలోనే పేరు మార్పుపై ఊహాగానాలు రావడంతో దేశ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి.

Spread the love