వ్యాపార, వర్తకుల ప్రయోజనాలపై మోడీ దెబ్బ

– జహంగీర్‌ని గెలిపించి అభివృద్ధికి పాటుపడండి : సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు బి.వెంకట్‌
నవతెలంగాణ-భువనగిరి/ నూతనకల్‌
వ్యాపారులు, వర్తకుల ప్రయోజనాలను దెబ్బతీస్తున్న మోడీని ఓడించి.. భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గ సీపీఐ(ఎం) అభ్యర్థి జహంగీర్‌ని గెలిపించి అభివృద్ధికి పాటుపడాలని ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు బి.వెంకట్‌ పిలుపునిచ్చారు. సీపీఐ(ఎం) అభ్యర్థి ఎండీ జహంగీర్‌ను గెలిపించాలని కోరుతూ గురువారం భువనగిరి పట్టణంలో బి.వెంకట్‌, సూర్యాపేట జిల్లా నూతనకల్‌లో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మల్లు లకిë ప్రచారం చేశారు. భువనగిరిలో వ్యాపారులు, వర్తకులు, ప్రజల్ని కలిసి జహంగీర్‌కు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా వెంకట్‌ మాట్లాడుతూ.. చిన్న వ్యాపారులు, వర్తకుల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్న ప్రధాని మోడీ.. కార్పొరేట్‌ వ్యవస్థ, వారి ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారని విమర్శించారు. జీఎస్టీ ఎత్తేయాలని డిమాండ్‌ చేశారు. మతోన్మాద, కార్పొరేట్‌ బీజేపీని ఈ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. కష్టజీవుల ప్రయోజనాల కోసం నికరంగా పోరాడుతున్న సీపీఐ(ఎం) అభ్యర్థి జహంగీర్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రజాస్వామ్యం, లౌకిక రాజ్యాంగం, సామాజిక న్యాయం, ఆర్థిక సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు ఎన్నికల్లో బీజేపీని సాగనంపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పాలడుగు భాస్కర్‌, రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, జె.వెంకటేశ్‌, ఆర్‌.వెంకట్రాములు, నాయకులు దాసరి పాండు, కోమటిరెడ్డి చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మతోన్మాద బీజేపీని ఓడించండి
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మల్లు లక్ష్మి
పార్లమెంట్‌ ఎన్నికల్లో మతోన్మాద బీజేపీని ఓడించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మల్లు లక్ష్మి పిలుపునిచ్చారు. నూతనకల్‌ మండల కేంద్రంలో ఎన్నికల ప్రచార రథాలను ఆమె జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం చిల్పకుంట్ల, ఎడవెల్లి, వెంకేపల్లి గ్రామాలలో ఇంటింటి ప్రచారం చేశారు. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఎండీ.జహంగీర్‌ గెలుపు ద్వారానే సాధ్యమవుతుందన్నారు. పదేండ్ల కాలంలో బీజేపీ ప్రజలు చెమటోడ్చి సంపాదించుకునే డబ్బును జీఎస్టీ రూపంలో తీసుకుని.. దేశ సంపదను కొద్దిమంది పెట్టుబడిదారులకు కట్టబెడుతోందని విమర్శించారు. బడా పెట్టుబడిదారులు బ్యాంకుల్లో తీసుకున్న వేల కోట్ల రూపాయల అప్పులను రద్దు చేసిందని తెలిపారు. ప్రభుత్వ రంగానికి సంబంధించిన సంస్థలను ప్రయివేటీకరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రయివేటీకరణ వల్ల రిజర్వేషన్లు ఉండవని, కిందిస్థాయి ప్రజలకు ఉద్యోగ అవకాశాల్లేకుండా పోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లు గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చే ఆలోచనలో ఉందని అన్నారు. మతం పేరుతో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తోందన్నారు. ఈ ప్రచారంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కందాల శంకర్‌ రెడ్డి, నాయకులు పులుసు సత్యం, వేల్పుల వెంకన్న, నరసింహారావు, కొప్పుల రజిత, బొజ్జ శ్రీను, తోట్ల లింగయ్య, గజబెల్లి తదితరులు పాల్గొన్నారు.

Spread the love