ఎన్నికల విధుల్లో నిక్కచ్చిగా వ్యవహరించండి

– పొరపాట్లు చేస్తే కఠినచర్యలు : వీడియో కాన్ఫరెన్స్‌లో కేంద్ర ఎన్నికల సంఘం డీసీ నితీశ్‌ వ్యాస్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో ఈ నెల 13న జరగనున్న లోకసభ ఎన్నికల్లో పక్షపాతానికి ఆస్కారం లేకుండా నిక్కచ్చిగా వ్యవహరించాలని కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటీ కమిషనర్‌ నితీశ్‌వ్యాస్‌ సూచించారు. గురువారం న్యూ ఢిల్లీలోని ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం నుంచి వ్యాస్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి వికాస్‌ రాజ్‌, సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి మహేష్‌ భగవత్‌, వ్యయ నోడల్‌ అధికారి సంజరు జైన్‌, అదనపు కమిషనర్‌ లోకేష్‌ కుమార్‌, సంయుక్త కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌, 17 లోక్‌సభ నియోజకవర్గాల పరిశీలకులు, జిల్లా కలెక్టర్లు, పోలీసు సూపరింటెండెంట్‌లు (ఎస్పీలు), రిటర్నింగ్‌ అధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో ఎన్నికల నిర్వహణపై నితీశ్‌ దిశా నిర్దేశం చేశారు. ఎపిక్‌ కార్డులు, బ్యాలెట్‌ బాక్స్‌ల పంపిణీ, పోలింగ్‌ స్టేషన్లలో త్రాగునీరు, ఇతర సౌకర్యాల ఏర్పాటు, ప్రత్యేక వైద్య బృందాలు, స్ట్రాంగ్‌ రూమ్‌లకు కల్పించాల్సిన భద్రత తదితరాంశాలు పరిశీలించి ఏమైనా పొరపాట్లు ఉంటే సరి చేయాలని ఆదేశించారు. ఎన్నికల్లో నిష్పక్షపాతంగా, పారదర్శకంగా వ్యవహరించాలనీ, విమర్శలకు ఆస్కారం లేకుండా ప్రతి అభ్యర్థిని, రాజకీయ పార్టీని సమానంగా చూడాలని సూచించారు. ప్రజలు, పార్టీలు, సంస్థల నుంచి వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. పోలింగ్‌కు ముందు 72 గంటల సమయం కీలకమనీ, ఆ దశలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. విధి నిర్వహణలో పొరపాట్లు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శాంతి భద్రతలకు భంగం కలగకుండా భద్రతా చర్యలు చేపట్టినట్టు రాష్ట్ర ఎన్నికల అధికారులు ఈ సందర్భంగా నితీశ్‌ వ్యాస్‌కు వివరించారు.

Spread the love