ప్రజ్వల్‌ కోసం మోడీ ప్రచారం దుర్మార్గం

– ఏఐసీసీ మహిళ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు అల్కాలంబ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
రేపిస్టు ప్రజ్వల్‌ రేవణ్న కోసం ప్రధాని మోడీ ప్రచారం చేయడం దుర్మార్గమని ఏఐసీసీ మహిళ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు అల్కాలంబ అన్నారు. వేల మంది మహిళలను బలత్కారం చేశారనీ, వారి వీడియోలను చిత్రీకరించారని గుర్తు చేశారు.మహిళా క్రీడాకారులను లైంగికంగా వేధించిన బ్రిజ్‌ భూషణ్‌ కుటుంబానికి లోక్‌సభ సీటును బీజేపీ ఇచ్చిందని విమర్శిం చారు.ఈ విషయమైన మహిళలు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. గురువారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో జాతీయ అధికార ప్రతినిధి సుజాతపాల్‌,మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షులు సునీతారావుతో కలిసి అల్కాలంబ విలేకర్లతో మాట్లాడారు. దేశంలో మహిళలకు రక్షణ లేకుండాపోయిందని ఈసందర్భంగా ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ మహిళలను వంటింటికే పరిమితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. రాజ్యాంగాన్ని మార్చడం ద్వారా రిజర్వేషన్లు ఎత్తివేయాలని బీజేపీ పన్నాగం పన్నుతున్నదని తెలిపారు.రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం మహిళా కోసం మహాలక్ష్మి రూ.500కు గ్యాస్‌,ఆరు గ్యారంటీ స్కీములు అమలు చేస్తున్నాయన్నారు.కర్నాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వం మహిళాభివృద్ధి కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని తెలిపారు.మహిళా సాధికారత కాంగ్రెస్‌ పార్టీ ద్వారానే సాధ్యమవుతుందన్నారు.అదానీ,అంబానీలకు మోడీ దేశ సంపదను దోచిపెడుతున్నారని ఆరోపించారు.దేశంలో ప్రజాస్వామ్యం ఉండాలన్నా…మహిళలకు రక్షణ కావాలన్నా…కాంగ్రెస్‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు.

Spread the love