నీట్‌పై మోడీ నోరెత్తరేం..

Modi's speech on NEET– లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్‌ ప్రమాదంలో పడినా కేంద్రం పట్టించుకోదా?
– మాజీ మంత్రి కేటీఆర్‌ విమర్శలుొ సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
”ఓవైపు గ్రేస్‌ మార్కుల గందరగోళం.. మరోవైపు పేపర్‌ లీకేజీల వ్యవహారంతో తల్లిదండ్రుల్లో ఆందోళన… ప్రధాని మోడీ పరీక్షా పే చర్చ నిర్వహించడం కాదు… ఆయన, ఆయన మంత్రివర్గ సహచరులు నీట్‌ వ్యవహారంపై స్పందించాలి” అని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే తారకరామారావు (కేటీఆర్‌) అన్నారు. ఈ మేరకు ఆదివారంనాడాయన ఓ బహిరంగలేఖ విడుదల చేశారు. నీట్‌ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులను శిక్షించాలని డిమాండ్‌ చేశారు. కష్టపడి చదివిన విద్యార్థులకు నష్టం జరగకుండా చూడాలని కోరారు. బీహార్‌లో రూ.30 లక్షల చొప్పున నీట్‌ ప్రశ్నాపత్రాలు విక్రయించారనీ, పదుల సంఖ్యలో అరెస్టులు జరుగుతున్నట్టు వార్తలు వస్తున్నా కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నదని విమర్శించారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా నీట్‌ ఎగ్జామ్‌లో ఏకంగా 67 మందికి ఫస్ట్‌ ర్యాంక్‌ రావటం అనేక అనుమానాలకు తావిస్తున్నదన్నారు. దానిలోనూ ఒకే సెంటర్‌ నుంచి ఎనిమిది మంది విద్యార్థులు ఏకంగా 720 మార్కులు సాధించడం చూస్తే.. పేపర్‌ లీకేజీ వ్యవహారం ఏ స్థాయిలో జరిగిందో అర్థమవుతున్నదని పేర్కొన్నారు. ఒక్క మార్కు తేడాతోనే విద్యార్థుల ర్యాంకులు మారిపోతాయనీ, ఎంతోమంది అవకాశాలు కోల్పోతారని గుర్తుచేశారు. పరీక్షా ఫలితాలను 10 రోజులు ముందుకు జరిపి, సరిగ్గా ఎన్నికల ఫలితాల రోజే ప్రకటించటం కూడా అనేక సందేహాలకు తావిచ్చిందన్నారు. లక్షల మంది విద్యార్థులు ఎన్ని ఫిర్యాదులు చేసిన కేంద్రం స్పందించలేదనీ, పలువురు ప్రముఖులు సుప్రీంకోర్టులో కేసు వేసినా ఒక్క వివరణ కూడా ఇవ్వలేదన్నారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకునేంత వరకు కేంద్రం ఈ అంశాన్ని పట్టించుకోకపోవటం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు. సుప్రీంకోర్టు ప్రశ్నించిన తర్వాత కూడా నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) చిత్రమైన సమాధానాలు చెప్పిందన్నారు. ఈ ఏడాది 1563 మందికి గ్రేస్‌ మార్కులు కలిపినట్లు చెబుతున్నారనీ, అసలు నీట్‌ లాంటి ఎగ్జామ్‌లకు గ్రేస్‌ మార్కులు కలిపే విధానమే లేదని స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా నీట్‌ ఎగ్జామ్‌ను పెద్దసంఖ్యలో విద్యార్థులు రాశారనీ, నీట్‌లో జరిగిన గ్రేస్‌ మార్కులు, పేపర్‌ లీకేజీ ఆరోపణల కారణంగా వారంతా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు.

Spread the love