నోటాతో మోడీ పోటీ!

నోటాతో మోడీ పోటీ!ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వా మ్య దేశంగా గొప్పలు చెప్పుకునే దేశంలో అసలు ప్రతిపక్షం అనేది ఉండకూడదా? ప్రతిపక్షాలు ఆందోళన పడుతున్నట్టుగా నిజంగానే మోడీ మరోసారి అధికారం చేపడితే భారత దేశంలో ఇవే చివరి ఎన్నికలా? ఇన్నాళ్లుగా తన అధికారం కోసం కుల, మతాల మధ్య వైషమ్యాలు పెట్టి అది పారక ప్రతిపక్ష పార్టీల నేతలను ఈడి పేరుతో జైళ్లో పెట్టించాడు. కానీ ఇప్పుడు ఏకంగా కుర్చీ కోసం ఎన్నికల్లో పోటీ చేస్తున్నా ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులనే ట్యాంపర్‌ చేస్తూ తనకు ప్రత్యర్థులు లేకుండా చేసుకుంటు న్నాడు. అంటే ఇదో రకంగా మోడీ నోటాతో పోటీ పడుతున్నట్టే. ఎందుకంటే ఏ స్థానాలైతే అసంబద్ధంగా కైవసం చేసుకోవాలని చూస్తున్నాడో, ఆ పార్లమెంటు నియోజకవర్గాల ప్రజల పరిస్థితి ఏంటి? వారికి ఓటు హక్కు వినియోగించుకోనే అవకాశం ఎక్కడుంటుంది?
లోక్‌సభ ఎన్నికలలో ఎన్నో దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. గుజరాత్‌లోని సూరత్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి నీలేష్‌ కుంభాని నామినేషన్‌ రద్దుకావడం, ఇతర ఇండిపెండెంట్లు బరిలోనుంచి తప్పుకోవడంతో బీజేపీ అభ్యర్థి ముకేష్‌ దలాల్‌ పోటీ లేకుండా అసంబద్ధంగా ఏకగ్రీవమయ్యారు. అక్కడ దాదాపు 18 లక్షల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుని, తమకు నచ్చిన ప్రజా ప్రతినిధి ఎన్నుకునే అవకాశం లేకుండా పోయింది. తాజాగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి అక్షరు కాంతి బమ్‌ తన నామినేషన్‌ను ఉపసంహరించుకుని బీజేపీలో చేరడం రాజకీయం మరింత రాజుకుంది. మే 13న మధ్యప్రదేశ్‌లో ఎన్నికలు జరగనున్నాయి ఇండోర్‌ లోక్‌సభా స్థానానికి మొత్తం 22 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు నామినేషన్ల ఉపసంహరణకు సరిగ్గా చివరి రోజు వెళ్లి తాను పోటీ నుంచి తప్పుకుంటున్నాని అందరూ చూస్తుండగానే మీడియా ముఖంగా తన నామినేషన్‌ ఉపసంహరించు కున్నారు.”ప్రధాని మోడీ మార్గదర్శ కత్వంలోని బీజేపీ ప్రగతిశీల ఆలోచనలు నచ్చి మా సహచరుడు కైలాస్‌ విజయ వర్గీయ, ఎమ్మెల్యే రమేష్‌ మెండోలాతో కలిసి, లోక్‌సభ అభ్యర్థిత్వం నుంచి వైదొలిగి బీజేపీలో చేరుతున్న అక్షరు కాంతి బమ్‌కు సాదర స్వాగతం పలుకుతున్నా” అని మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి మోహన్‌ యాదవ్‌ ప్రకటిం చారు. దీన్నిబట్టి చూస్తే ఇదంతా ఒక ప్రణాళిక ప్రకారం జరిగిందని తెలుస్తోంది.
ఇండోర్‌లో అక్షర కాంతి బామ్‌ నామినేషన్‌ ఉపసంహరించుకోవడంలో ఉన్న ఆంతర్యమేమిటి? నిజంగానే మోడీ సిద్ధాంతాలకు ఆకర్షితుడయ్య డా? కానీ వాస్తవంగా పరిశీలిస్తే దీనికి వెనుక పెద్ద రాజకీయ కుట్రకోణం దాగుందనిపిస్తోంది. సరిగ్గా అభ్యర్థి తన నామినేషన్‌ ఉపసంహరించుకొనే మూడు రోజుల ముందు 17 ఏండ్ల కిందటి స్థల వివాదం కేసును బయటకు తీశారు. ఓ వ్యక్తిని బెదిరిం చాడని సెక్షన్‌ 307 కింద కోర్టుకు హాజరు కావాలని నోటీసులు అందాయి. ఆ తర్వాత బీజేపీ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన పార్టీలో చేరాడు. ఇదంతా యాదృచ్చికంగా జరిగిందనుకుంటే పొరపాటే! నాగపూర్‌ తర్వాత ఇండోర్‌ ఆరెస్సెస్‌కు అత్యంత ముఖ్యమైన స్థావరం. అలాంటి ఇండోర్‌లో గత 40 ఏండ్లుగా అంటే 2019 వరకు అక్కడ సుమిత్ర మహజన్‌ వరుసగా గెలుస్తూ వస్తున్నారు. ఆయితే 2019లో శంకర్‌ లల్వానీకి టికెట్టిచ్చి ఐదు లక్షల భారీ మెజార్టీతో గెలిపించింది బీజేపీ. అంత మెజార్టీ స్థాయిలో గెలిచిన పార్లమెంటు సెగ్మెంట్లలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి నామినేషన్‌ని ఎందుకు విత్‌డ్రా చేయించింది? దీన్ని బట్టి చూస్తే ఓటమి భయం బీజేపీని వెంటాడుతుందా? అంటే దీన్నిబట్టి చూస్తే అదే అర్థమవుతున్నది. అందుకే బీజేపీ అరుణాచల్‌ప్రదేశ్‌ నుంచి ఇండోర్‌ వరకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తుందా? అన్న వాదనలకు బలం చేకూరుస్తున్నది.
మొన్న ఖజురహోలో సమాజ్‌ వాదీ పార్టీ అభ్యర్థి మీరా యాదవ్‌ నామినేషన్‌ తిరస్కరణకు గురైంది. దీనికి కారణాలు బయటకు పొక్కకున్నా ఇందులో బీజేపీ పాత్ర ఉందనేది ప్రతిపక్షాల ఆరోపణ. ఇండోర్‌లో కేవలం ఒకే ఒక్క జాతీయ పార్టీ బీజేపీ మాత్రమే పోటీలో ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత, ప్రజల కొరకు, ఎన్నుకోబడిన వారే ప్రజాప్రతినిదులు కావాలి కానీ బీజేపీ ఎవరు పోటీలో ఉండాలో, ఉండకూడదో నిర్ణయిస్తున్నది. ఇది ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ స్ఫూర్తికి పూర్తి వ్యతిరేకం. ఇలా పోటీలో ప్రతిపక్షం అనేది ఉండకూడదు అనుకున్నపుడు ఇంకా ఎన్నికలు నిర్వహించడం ఎందుకు? ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరగాలి. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ధైర్యంగా ముందుకు వచ్చి పౌరుడు తనకు నచ్చిన వ్యక్తిని ఎన్నుకునే స్వేచ్ఛని ఉండాలి. ప్రజల్లో ఓటు గొప్పతనాన్ని చాటి చెప్పి ఓటింగ్‌ శాతం పెంచే విధంగా కృషి చేయాలి. కానీ ఓటు హక్కును వినియోగించుకోకుండా ఏకపక్షంగా ప్రతిపక్షం లేకుండా ఏకగ్రీవం చేయడం, వారికి పోటీ అనుకున్నవారిని బలవంతంగా తప్పించడం బీజేపీ నిజస్వరూపాన్ని బయటపెడుతున్నాయి.
ఇప్పటికే తన అధికారానికి అడ్డుగా ఉన్నారని కేజ్రీవాల్‌, లొంగడం లేదని హేమంత్‌ సోరెన్‌ లాంటి ముఖ్యమంత్రుల మీద కేసులు పెట్టించి ఈడి పేరుతో జైల్లో పెట్టడం చూశాం. అది చాలదంటూ ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్న నాయకులన సామ, దాన, భేద, దండో పాయాలు ఉపయోగించి లొంగదీసుకుం టున్నాడు. ప్రతిపక్ష నాయకులు ‘ఉంటే మోడీ జేబులో ఉండాలి.. లేదంటే జైల్లో ఉండాలి’ అనే విధంగా తయారైంది బీజేపీ రాజకీయ వ్యవహరం.
మొన్న ఖజురహో! నిన్న సూరత్‌! నేడు ఇండోర్‌, మరి రేపు ఎక్కడో? మోడీ అధికార దాహానికి ఎన్ని స్థానాల్లో ఓటర్లు ఓటేయకుండా బలికావాలి? బీజేపీ ఇంత అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నా కూడా ఎన్నికల కమిషన్‌ చూసీ చూడనట్లు వ్యవహరించడం శోచనీయం. ఇదంతా చూస్తూ ఉంటే వామపక్షాలు చెబుతున్నట్టు 2024లో మళ్లీ మోడీ అధికారంలోకి వస్తే ఇవే చివరి ఎన్నికలవుతాయి అనేది నిజం కాబో తుందా? ప్రజాస్వామ్య మనుగడ అనేది ఇక ప్రశ్నార్థక మేనా? ప్రజలు ఆలోచించాల్సిన సమయమిది.
భరత్‌ చౌహాన్‌
9030666999

Spread the love