– బడ్జెట్‌లో ప్రస్తావన లేకపోవటమే సాక్ష్యం
– కనీసంగా తొమ్మిది వేలు ఇవ్వాల్సిందే..
– 16న కేంద్ర కార్మిక సంఘాల సమ్మెలో పాల్గొంటాం : విలేకర్లతో సంఘం ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పదవీ విరమణ తర్వాత ప్రశాంతంగా జీవించాల్సిన పెన్షనర్ల పట్ల బీజేపీ కేంద్ర ప్రభుత్వం దమననీతిని కొనసాగిస్తున్న’దని తెలంగాణ ఆల్ పెన్షనర్స్, రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పోతుల నారాయణ రెడ్డి, పాలకుర్తి కృష్ణమూర్తి విమర్శించారు. పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. సంఘం నేతలు ఎన్‌బీ చారి, వైకుంఠరావు, కె నాగేశ్వరరావు, రాధాకృష్ణ, విజయకుమార్, మాణిక్యాలరావుతో కలిసి శనివారం హైదరాబాద్‌లోని పోస్టల్ రాష్ట్ర కార్యాలయంలో విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. కేంద్ర బడ్జెట్‌లో పెన్షనర్ల ప్రస్తావనే లేకుండా దాటవేశారనీ, వారి సంక్షేమం,జీవితం పట్ల ఇంత నిర్లక్షమెందుకని ప్రశ్నించారు. మోడీ ప్రభుత్వ కార్మిక, రైతాంగ, పెన్షనర్ల వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 16న జరిగే సమ్మెలో పెన్షనర్లు పాల్గొంటారని ప్రకటించారు. ఈపీఎస్95 పెన్షనర్లకు కనీస పెన్షన్ తొమ్మిదివేలకు పెంచాలని గల్లీ నుంచి ఢిల్లీ వరకు పలు పోరాటాలు నిర్వహించామని గుర్తు చేశారు. అయినా బీజేపీ ప్రభుత్వం దున్నపోతు మీద వాన పడ్డ చందంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. ప్రభుత్వ రంగంలో పనిచేసి పదవీ విరమణ పొంది ఈపీఎఫ్95 పెన్షన్‌లో కొనసాగుతున్న వారు దేశంలో 73 లక్షల మంది ఉన్నారన్నారని గుర్తు చేశారు. వారికి కనీస పెన్షన్ రూ. వెయ్యి నుంచి రూ.4,500 వరకు మాత్రమే వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. మరి కొంతమందికి వెయ్యిలోపు మాత్రమే పెన్షన్ వస్తున్నదనీ, వీటితో ఎలా బతుకుతారో మోడీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ స్కీంతెచ్చినప్పుడు రెండేండ్లకొక సారి పరిశీలిస్తామనీ, డీఆర్ ఇస్తామని చెప్పిన ప్రభుత్వ పెద్దల మాటలు నీటి మూటలయ్యాయన్నారు.
గత ప్రభుత్వాలు కోషియార్ కమిటీ వేస్తే, ఆ కమిటీ కనీస పెన్షన్ రూ. మూడు వేలు ఇవ్వాలనీ, డీఆర్ ఇవ్వాలని సూచించిందని గుర్తు చేశారు. బీజేపీ కేంద్ర నాయకులు జవదేకర్ ఢిల్లీలో జరిగిన పెన్షనర్ల ధర్నాలకు వచ్చి అధికారంలోకి బీజేపీ రాగానే ఆ కమిటీ సూచనలను అమలు చేస్తామని వాగ్దానం చేశారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి తొమ్మిదేండ్లు దాటినా..పెన్షనర్ల సమస్యలు పరిష్కరించటానికి వారికి సమయం దొరకకపోవటం విడ్డూరంగా ఉందన్నారు. పైగా పార్లమెంటు సాక్షిగా పెన్షనర్ల సమస్యలు పరిష్కరించలేమని చెప్పడం వారి ప్రభుత్వ ద్వంద నీతికి నిదర్శనమని విమర్శించారు. హైకోర్టు, సుప్రీంకోర్టు పెన్షన్ కట్ ఆఫ్ ఉండొద్దనీ, పూర్తి పెన్షన్ ఇవ్వాలని తీర్పు చెప్పినా, దానికి అనేక అడ్డంకులు పెట్టి, న్యాయస్థానాల తీర్పులను పక్కన పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. 2022-23 ఈపీఎఫ్‌ఓ నివేదిక ప్రకారం రూ.51,985 కోట్లు వడ్డీ రూపంలో ఆదాయం వస్తున్నదనీ, పెన్షనర్లకు కేవలం రూ.14.44కోట్లు (28శాతం) చెల్లించి, మిగతాది ప్రభుత్వం తమ ఖాతాలో వేసుకుంటున్నదని తెలిపారు.అనారోగ్యంతో, వయోధికులుగా ఉన్న పెన్షనర్ల పట్ల కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయోద్దని పిలుపునిస్తున్నామని తెలిపారు. ఈ నెల 5,7,9 తేదీలలో పిఎఫ్ కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు ప్రకటించారు. రాష్ట్ర పరిధిలోని ఈపీఎస్ పెన్షనర్లకు కాంట్రిబ్యూషన్ లేని వైద్య సౌకర్యం కల్పించాలనీ, బీపీఎల్ పరిధిలోకి వచ్చే ఈపీఎస్ పెన్షనర్లకు ఆసరా పెన్షన్ ఇవ్వాలనీ, సీనియర్ సిటిజన్లకు రైల్వే రాయితీ, రాష్ట్ర పరిధిలోని రవాణా రాయితీలు కల్పించాలని డిమాండ్ చేశారు.