పొట్టి ఫార్మాట్‌లో మంగోలియా జట్టు చెత్త రికార్డ్

నవతెలంగాణ – హైదరాబాద్: బౌలర్లకు కాలరాత్రులను మిగుల్చుతూ బ్యాటర్లు పండుగ చేసుకుంటున్న పొట్టి ఫార్మాట్‌లో మంగోలియా జట్టు మాత్రం చెత్త రికార్డును మూటగట్టుకుంది. గతేడాది ఆసియా క్రీడల సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన ఆ జట్టు.. జపాన్‌తో ఆడిన రెండో టీ20 మ్యాచ్‌లో 8.2 ఓవర్లలో 12 పరుగులకే ఆలౌట్‌ అయింది. బుధవారం సానొ (జపాన్‌) వేదికగా జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన జపాన్‌.. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 217 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన మంగోలియా.. 12 రన్స్‌కే కుప్పకూలి 205 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది. ఆ జట్టులో ఆరుగురు బ్యాటర్లు ‘సున్నా’కే ఔటవ్వగా 4 పరుగులతో తుర్‌ సుమ్య టాప్‌ స్కోరర్‌. జపాన్‌ బౌలర్‌ కజుమొ 3.2 ఓవర్లు వేసి 7 పరుగులే ఇచ్చి ఐదు వికెట్లు తీశాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌ చరిత్రలో ఇది (12) రెండో అత్యల్ప స్కోరు. గతేడాది ఫిబ్రవరి ‘ఐల్‌ ఆఫ్‌ మ్యాన్‌’ను స్పెయిన్‌ 10 పరుగులకే ఆలౌట్‌ చేసింది.

Spread the love