విజ్ఞాన చంద్రోదయం

Moon rise of science– ఇది సైన్స్‌ సాధించిన విజయం… భారత్‌కు గర్వకారణం
– జాబిలిపై సురక్షితంగా కాలుమోపిన ల్యాండర్‌ విక్రమ్‌
– 20 నిమిషాల్లో సాఫ్ట్‌ ల్యాండింగ్‌ ప్రక్రియ పూర్తి
– దక్షిణధృవాన్ని చూసిన మొదటి దేశంగా చరిత్ర
– రెండు వారాలు పరిశోధనలు చేయనున్న రోవర్‌
చంద్రునిపై మువ్వన్నెల పతాకం రెపరెపలాడింది. అంతరిక్ష చరిత్రలో భారతావని సువర్ణాధ్యాయాన్ని లిఖించింది. చందమామను ముద్దాడిన నాలుగో దేశంగా, ఇప్పటి వరకూ ఎవరూ కాలూనని దక్షిణ ధృవంపై సాఫ్ట్‌ లాండింగ్‌ చేసిన మొట్టమొదటి దేశంగా ఇండియా రికార్డు సృష్టించింది. తద్వారా చంద్రునిపై ఇప్పటికే కాలుమోపిన అమెరికా, రష్యా, చైనా సరసన చేరింది. నలభై ఒక్క రోజుల సుదీర్ఘ ప్రయాణం అనంతరం ల్యాండర్‌ విక్రమ్‌ బుధవారం సాయంత్రం 6.04 గంటలకు సురక్షితంగా జాబిలిపై కాలుమోపింది. ఆ వెంటనే దాని నుంచి ఆరు చక్రాల రోవర్‌ ప్రజ్ఞాన్‌ వేరుపడి సెకనుకు సెంటీమీటరు వేగంతో కదులుతూ చంద్రునిపై అడుగు పెట్టింది. మొత్తంమీద సాఫ్ట్‌ ల్యాండింగ్‌ ప్రక్రియకు 20 నిమిషాల సమయం పట్టింది. రోవర్‌ ప్రజ్ఞాన్‌ 14 రోజుల పాటు చంద్రుని ఉపరితలంపై పరిశోధనలు చేస్తుంది. ప్రయోగం విజయవంతం కాగానే ‘నా గమ్యాన్ని చేరుకున్నాను. నాతో పాటు మీరు కూడా…’ అని ఇస్రో ట్వీట్‌ చేసింది. బెంగళూరులోని మిషన్‌ కంట్రోల్‌ కాంప్లెక్స్‌లో క్షణక్షణం ఉత్కంఠగా ఎదురు చూసిన శాస్త్రవేత్తలు కరతాళధ్వనులతో జయజయధ్వానాలు చేశారు. మరోవైపు దేశవ్యాప్తంగా అంబరాలు సంబరాన్ని అంటాయి. 2019లో చంద్రయాన్‌-2 వైఫల్యం మిగిల్చిన బాధాకరమైన జ్ఞాపకాలను జాతి యావత్తూ మరిచిపోయింది. ఇది సైన్స్‌ సాధించిన విజయంగా శాస్త్రవేత్తలు, అభిప్రాయపడ్డారు. చంద్రయాన్‌ 2 విఫలమైన నేపథ్యంలో కసిగా మరింత కఠినమైన కసరత్తు చేసి, వైఫల్యాల నుండే గుణపాఠాలు నేర్చుకుని మరింత పకడ్బందీగా చంద్రయాన్‌-3కి ఇస్రో సిద్ధమై విజయం సాధించింది.
వైఫల్యాల నుంచి విజయాల వైపు
– చంద్రయాన్‌-2లో లేని కొన్ని అంశాలను ఈసారి అదనంగా జోడించింది.
– గంటకు 10.8కిలోమీటర్ల వేగం వరకు సురక్షితంగా దిగగలిగేలా కొత్త విక్రమ్‌ ల్యాండర్‌ కాళ్ళను పటిష్టపరిచింది.
– అలాగే పెద్ద ఇంధన ట్యాంక్‌ను అమర్చారు. చివరి నిముషంలో మార్పులు జరిగి అవసరమైతే అనుకూల ప్రదేశం కోసం అన్వేషణ సాగించేవరకు ఇంధనం వుండేలా చంద్రయాన్‌- 3లో మరింత పెద్ద ట్యాంక్‌ను అమర్చారు.
– చంద్రయాన్‌-2లో కేవలం రెండువైపుల మాత్రమే సౌర ఫలకాలు పెట్టారు. ఈసారి ల్యాండర్‌కు నాలుగు వైపులా సోలార్‌ ప్యానెళ్ళు అమర్చారు.
బెంగళూరు : చంద్రయాన్‌-3 ప్రయాణం జూలై 14న శ్రీహరికోటలో ప్రారంభమైంది. ఎల్‌వీఎం3-ఎం4 రాకెట్‌ ద్వారా చంద్రయాన్‌ను ప్రయోగించారు. కక్ష్యను పెంచడం, తగ్గించడం వంటి ప్రక్రియలను దిగ్విజయంగా పూర్తి చేసుకొని సాయంత్రం 5.44 గంటలకు ల్యాండర్‌ మాడ్యూల్‌ నిర్దేశిత ప్రాంతానికి చేరుకుంది. చంద్రుడి ఉపరితలానికి 30 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు ఆటోమేటిక్‌ ల్యాండింగ్‌ సీక్వెన్స్‌ ప్రారంభమైంది. ఏఎల్‌ఎస్‌ కమాండ్‌ను స్వీకరించి, థ్రాటర్‌బుల్‌ ఇంజిన్ల వేగాన్ని తగ్గించుకుంటూ ముందుకు సాగింది. గంటకు సుమారు ఆరు వేల కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే ల్యాండర్‌ విక్రమ్‌ కేవలం 17 నిమిషాలలోనే తన జోరుకు కళ్లెం వేసుకొని చందమామ దక్షిణ ధృవంపై సురక్షితంగా దిగింది. దక్షిణ ధృవానికి దగ్గరగా సుమారు 70 డిగ్రీల దక్షిణ అక్షాంశం వద్ద సాఫ్ట్‌ ల్యాండింగ్‌ జరిగింది. చంద్రయాన్‌-2 విఫలమైన నేపథ్యంలో ఇస్రో శాస్త్రవేత్తలు అన్ని జాగ్రత్తలు తీసుకు న్నారు. ల్యాండర్‌ విక్రమ్‌లో అదనపు సెన్సార్లు అమ ర్చారు. కీలక వ్యవస్థలు విఫలమైనా సాఫ్ట్‌ ల్యాండింగ్‌ కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. చంద్రుని పైన కాలు పెట్టడం అంత తేలిక కాదు. ఇప్పటి వరకూ 12 దేశాలు 141 సార్లు ప్రయత్నాలు చేయగా 69 సార్లు మాత్రమే విజయం సాధించాయి. అగ్రరాజ్యమైన అమెరికా సైతం పదిహేను వైఫల్యాలను చవిచూసింది.
వెల్లువెత్తుతున్న అభినందనలు
ఇస్రో కృషిని ప్రశంసిస్తూ దేశ విదేశాల నుండి ప్రశంసలు, హర్షాతిరేకాలు వెల్లువెత్తుతున్నాయి. నూతన సాంకేతికతలను భారత్‌ ప్రదర్శించిన తీరు ఆమోఘమని యురోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ డైరెక్టర్‌ జనరల్‌ వ్యాఖ్యానించారు. నాసా అడ్మినిస్ట్రేటర్‌ బిల్‌ నెల్సన్‌ కూడా ఇస్రోను అభినందించారు. మూన్‌ మిషన్‌కు అవసరమైన పరికరాలను, వస్తువులను సరఫరా చేసిన లార్సెన్‌ అండ్‌ టుబ్రో, గాడ్రెజ్‌ అండ్‌ బాయిస్‌ కంపెనీలు కూడా అభినందనలు అందచేశాయి. పలు రాజకీయ పార్టీల నేతలు, మంత్రులు, అధికారులు, ప్రముఖులు ఇస్రోను ప్రశంసల్లో ముంచెత్తారు.
అనుకున్న సమయానికి అనుకున్నట్లుగా అన్నీ…
ల్యాండింగ్‌ ప్రక్రియకు రెండు గంటలు ముందుగా 3.45 గంటలకు ల్యాండర్‌ మాడ్యూల్‌ను, ల్యాండింగ్‌ పరిస్థితులను ఇస్రో నిశితంగా పరిశీలించింది. ఒకవేళ పరిస్థితులు అనుకూలంగా లేకపోతే 27న ఈ ల్యాండింగ్‌ ప్రక్రియను ప్రారంభించాలని కూడా నిర్ణయించింది. అయితే, సరిగ్గా నిర్దేశిత సమయం 5.44 గంటలకు ల్యాండింగ్‌ ప్రక్రియ మొదలైంది. తర్వాత వరుసగా నాలుగు దశలను విజయవంతంగా విజ్ఞాన చంద్రోదయం అధిగమిస్తూ లక్ష్యాన్ని చేరుకుంది. 10నిముషాలకు పైగా గల రఫ్‌ బ్రేకింగ్‌ దశలో ల్యాండర్‌ సమతల వేగం గంటకు 6వేల కిలోమీటర్ల నుండి గంటకు 500కిలోమీటర్ల వరకు తగ్గింది. ఆ తర్వాత అల్టిట్యూడ్‌ హోల్డింగ్‌ దశలో చంద్రుని ఉపరితలంపైన దాదాపు 7.43 కిలోమీటర్ల ఎత్తున వున్న ల్యాండర్‌ దాదాపు 3.48కిలోమీటర్లు దూరం కిందకు దిగి సమతులంగా చేస్తున్న ప్రయాణాన్ని నిట్టనిలువుకు పొజిషన్‌కు మార్చుకుంది. ఫైర్‌ బ్రేకింగ్‌ దశ 175 సెకన్లు వుంది. ఈ సమయంలో ఎత్తును ఒక కిలోమీటరు తగ్గించుకుంటూనే దిగాల్సిన ప్రదేశానికి 28.52 కిలోమీటర్లు సమతులంగా ప్రయాణించింది. ఇక చివరి దశలో నిట్టనిలువుగా వున్న ల్యాండర్‌ చంద్రుని ఉపరితలంపై ముందుగా నిర్దేశించిన ప్రదేశంలో సురక్షితంగా దిగింది. కొద్ది గంటల్లో బయటకు ప్రజ్ఞాన్‌ రోవర్‌ ల్యాండర్‌ మిషన్‌లోని అన్ని వ్యవస్థల తీరుతెన్నులను ఇస్రో పర్యవేక్షిస్తోంది. రానున్న కొద్ది గంటల్లో ల్యాండర్‌ మాడ్యూల్‌ నుండి ప్రజ్ఞాన్‌ రోవర్‌ బయటకు వస్తుందని ఇస్రో చీఫ్‌ సోమనాథ్‌ ప్రకటించారు. ఊహించిన దానికన్నా ల్యాండర్‌ దిగిన వేగం చాలా తక్కువగా వుందని అన్నారు. సెకనుకు 2 మీటర్లు లక్ష్యంగా పెట్టుకోగా అంతకన్నా తక్కువగానే వుందని, దీంతో భవిష్యత్‌ మిషన్‌లపై మరింతగా ఆశలు పెరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. రాబోయే 14 రోజుల్లో ల్యాండర్‌, రోవర్లలోని పరికరాలు చేసే ప్రయోగాలు ఉద్వేగభరితంగా వుంటాయని అన్నారు. విజయ సాధనలో భాగస్వాములైన శాస్త్రవేత్తల బృందానికి సోమనాథ్‌ కృతజ్ఞతలు తెలియచేశారు.
అద్భుత ప్రయాణం : సీతారాం ఏచూరి
చరిత్ర సృష్టించిన ఇస్రో శాస్త్రవేత్తలకు సీపీఐ(ఎం) నేత సీతారాం ఏచూరి అభినందనలు తెలియచేశారు. దశాబ్దాల తరబడి శాస్త్రవేత్తలు చేసిన కృషికి ఈ విజయం నిదర్శనం. భారత్‌కు ఇది మహత్తరమైన రోజు, శాస్తీయ దృక్పథానికి, హేతుబద్ధతకు నివాళి అని కొనియాడారు. ఆరు దశాబ్దాలుగా నిబద్ధత, కఠోర శ్రమ, అంకిత భావంతో సాగిన ఈ ప్రయాణం ఈ దార్శనికతను సాకారం చేసిందని అన్నారు. ఈ ప్రయాణం ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు.

ఇక సూర్యుడే లక్ష్యం : ప్రధాని మోడీ
జాబిల్లిపై పెట్టుకున్న లక్ష్యాన్ని విజయవంతంగా సాధించిన ఇస్రో ఇక తన తర్వాతి ప్రాజెక్టులపై దృష్టి పెట్టనుంది. త్వరలోనే ఆదిత్య ఎల్‌1 పేరుతో ఇస్రో సోలార్‌ మిషన్‌ను ప్రారంభిస్తుందని ప్రధాని మోడీ ప్రకటించారు. సెప్టెంబరు మొదటి వారంలో బహుశా దీనిపై వివరాలు వెల్లడయ్యే అవకాశం వుంది. వాతావరణ పరిశీలనకు ఉపగ్రహాన్ని పంపించాలని కూడా ఇస్రో భావిస్తోంది. గగన్‌యాన్‌ హ్యూమన్‌ స్పేస్‌ ఫ్లైట్‌ ప్రోగ్రామ్‌లో భాగంగా టెస్ట్‌ వెహికల్‌ను పంపాలని చూస్తోంది. శుక్ర గ్రహంపైకి కూడా మిషన్‌ చేపట్టాలని ఇస్రో భావిస్తోంది. చంద్రయాన్‌ 3 విజయం పట్ల సీఎం కేసీఆర్‌ హర్షం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
సేఫ్‌ లాండింగ్‌ అనే చివరి ఘట్టాన్ని చేరుకోవడం ద్వారా చంద్రయాన్‌ 3 ప్రయోగం సంపూర్ణ విజయాన్ని సాధించడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు హర్షం వ్యక్తం చేశారు. చంద్రుని దక్షిణ ధ్రువం మీదకు లాండర్‌ మాడ్యూల్‌ను విజయవంతంగా చేర్చిన మొట్ట మొదటి దేశంగా, ప్రపంచ అంతరిక్ష పరిశోధనా రంగంలో భారత దేశం సరికొత్త అధ్యాయాన్ని లిఖించిందనీ, అరుదైన చరిత్రను సృష్టించిందని సీఎం తెలిపారు. ఇది ప్రతీ భారతీయుడు గర్వించదగ్గ సందర్భం అని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఈ సందర్భంగా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో శాస్త్రవేత్తలకు, సిబ్బందికి.. ఈ ప్రయోగం విజయవంతం కావడంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి ఆయన అభినందనలు తెలిపారు. చిరకాల ఆకాంక్ష నెరవేరిన సందర్భంలో యావత్‌ భారతదేశ ప్రజలకు ఇది పండుగ రోజని సీఎం అన్నారు. భవిష్యత్‌లో ఇస్రో చేపట్టబోయే అంతరిక్ష పరిశోధనలకు, ప్రయోగాలకు చంద్రయాన్‌ 3 విజయం గొప్ప ప్రేరణినిస్తుందని సీఎం పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ, దేశ కీర్తి ప్రతిష్టలను మరింతగా పెంచే దిశగా, అంతరిక్ష పరిశోధన రంగంలో ఇస్రో తన విజయపరంపరను కొనసాగించాలని సీఎం కేసీఆర్‌ ఆకాంక్షించారు.

Spread the love