– సెస్ డబ్బులు కార్మికుల సంక్షేమానికే ఉపయోగించాలి
– తెలంగాణ భవన ఇతర నిర్మాణ వర్కర్స్ ఫెడరేషన్ నేతల డిమాండ్
– కార్మిక శాఖ కార్యాలయం వద్ద మహాధర్నా
– వెల్ఫేర్ బోర్డు సెక్రటరీ గంగాధర్‌కు వినతిపత్రం
నవతెలంగాణ – ముషీరాబాద్
ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చిన హామీ ప్రకారం కార్మికులకు వెంటనే మోటార్ సైకిళ్లు ఇవ్వాలని తెలంగాణ భవన, ఇతర నిర్మాణ వర్కర్స్ ఫెడరేషన్ (సీఐటీయూ) నేతలు డిమాండ్ చేశారు. మంగళవారం పెద్దఎత్తున భవన నిర్మాణ కార్మికులు హైదరాబాద్ చిక్కడపల్లిలోని అంజయ్య భవన్ కార్మిక శాఖ కార్యాలయం ఎదుట మహాధర్నా చేశారు. వెల్ఫేర్ బోర్డు సెక్రటరీ గంగాధర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర గౌరవాధ్యక్షులు వంగూరి రాములు, అధ్యక్షులు సుంకర రామ్మోహన్, ప్రధాన కార్యదర్శి కోటంరాజు, ఉపాధ్యక్షులు లక్ష్మణ్ మాట్లాడారు.
రాష్ట్రవ్యాప్తంగా భవన నిర్మాణ రంగంలో 25 లక్షల మంది కార్మికులు పని చేస్తున్నారని చెప్పారు. కార్మికుల సంక్షేమం కోసం వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు కోసం సీఐటీయూ, ఇతర అనుబంధ సంఘాలు చేసిన అనేక పోరాటాల ఫలితంగా 1996లో కార్మిక వెల్ఫేర్ బోర్డు చట్టం వచ్చిందన్నారు. ఈ చట్టం ఆధారంగా కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాల్సి ఉందన్నారు. కార్మికులు కష్టపడి బిల్డింగులు కడితే సెస్ ద్వారా రూ.4,300కోట్లు వసూలు చేశారని, అందులో కార్మికుల సంక్షేమానికి నామమాత్రమే ఖర్చు పెడుతున్నారని చెప్పారు. ప్రమాదవశాత్తు మరణించిన కార్మికులకు రూ.ఆరు లక్షల ముప్పై వేలు చెల్లిస్తున్నారని, దానిని పది లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. సహజ మరణం చెందిన కార్మికులకు సంబంధించి ఆ కుటుంబానికి లక్ష రూపాయలు ఇస్తున్నారని దానిని ఐదు లక్షలకు పెంచాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా కార్మికుల శ్రమను గుర్తించి వారికి మోటార్ సైకిళ్లు అందిస్తామని హామీ ఇచ్చిందని, రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు హామీ అమలు చేయలేదని అన్నారు. వెల్ఫేర్ బోర్డు ద్వారా కార్మికుల పిల్లల చదువుకు రెండు లక్షల స్కాలర్‌షిప్ అందించాలని కోరారు. కార్మికుల డబ్బులను కార్మికుల సంక్షేమానికే ఖర్చు పెట్టాలని, అందుకు వెల్ఫేర్ బోర్డులో అడ్వెంచర్ కమిటీ ఏర్పాటు చేయాలని అన్నారు. కార్మిక నిధులు అడ్వెంచర్ కమిటీ ద్వారా ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు తంబ్ సిస్టం ద్వారా తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. తంబ్ సిస్టంతో పాటు ఐ-సిస్టం ఏర్పాటు చేయాలని, తద్వారా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ హామీ ప్రకారం 25 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు మోటార్ సైకిల్స్. 7లక్షల మంది మహిళా కార్మికులకు స్కూటీలు వెంటనే అందించకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ మహాధర్నాలో వివిధ జిల్లాల నుంచి పెద్దఎత్తున తరలివచ్చిన కార్మికులు పాల్గొన్నారు