ఆర్ఓబి పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి: ఎంపి అరవింద్

– పనుల్లో వేగం పెంచండి
– కాంట్రాక్టర్ పని చేయకపోతే బ్లాక్ లిస్టులో పెట్టండి
– ఎన్ ఎచ్ డిప్యూటీ ఈఈ పై చరవాణిలో ఎంపీ అర్వింద్ ఆగ్రహం
నవతెలంగాణ – మాక్లూర్
మండలంలోని అడివి మామిడిపల్లి అర్ఓబి నిర్మాణ పనులను ఎంపీ అర్వింద్ ఆకస్మికంగా పర్యవేక్షించారు. పార్లమెంట్ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఆర్మూర్లో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయ్యేందుకు నిజామాబాద్ నుండి వెళ్తుండగా మార్గమధ్యంలో అడవి మామిడిపల్లి ఆర్ఓబి 802 నిర్మాణ పనులను పరిశీలించారు. ప్రభుత్వ నిర్మాణాల మీద బిఅర్ఎస్ నాయకులు దేశ్ కీ నేతా కేసీఆర్, జీవనన్న ఆర్మూర్ వంటి రాతలు రాయడం పట్ల ఆయన వ్యంగ్యంగా స్పందించారు. కేసీఆర్ పురుషుడని,దేశ్ కీ నేతా కాదని, ఒకవేళ భవిష్యత్తులో ఎపుడైనా అయినా దేశ్ కీ నేతా కాదని, దేశ్ కా నేతా అనాలని ఆ సంగతి కూడా ఎమ్మెల్యే, బీఆర్ ఎస్ నాయకులకు తెలియకపోతే ఎలా అని ఎద్దేవా చేసారు. 100% కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన ఆర్ఓబి నిర్మాణానికి కేంద్రం 14 కోట్లకు పైగా నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పుడో అందజేసినా పనులు నెమ్మదిగా కొనసాగడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం డిప్యూటీ ఈఈ శంకర్ కి చరవాణిలో పనులు మందకొడిగా కొనసాగుతున్నాయని, కాంట్రాక్టర్ ల మీద పర్యవేక్షణ చేయకుండా ఏం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగైదు నెలల క్రితం తాను చేసిన రివ్యూ లోనే పనులు నెమ్మదిగా చేస్తున్న సంబంధిత కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్టులో పెట్టాలని సూచించానని, ఇప్పటివరకు చర్యలు ఎందుకు తీసుకోలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.డిప్యూటీ ఈఈ సమాధానంపై సంతృప్తి చెందని ఎంపీ ఈఈ కాంతయ్యకి ఫోన్ చేసి, వాస్తవ పరిస్థితులు వివరించగా, రానున్న వారం రోజుల్లో పనులు ఊపందుకుంటాయని ఈఈ వివరించగా, వారం వారం చేసిన పని ప్రగతిని తనకు అందజేయాలని ఎంపీ ఆదేశించారు.

Spread the love