ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి

– ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ హైదరాబాద్‌ డివిజన్‌ అధ్యక్షులు ఎల్‌.మద్దిలేటి
– యూనియన్‌ మహిళా విభాగం ఆధ్వర్యంలో సంతకాల సేకరణ
నవతెలంగాణ-హిమాయత్‌నగర్‌
మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన డబ్ల్యూఎఫ్‌ఐ చైర్మెన్‌, ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (ఎల్‌ఐసీ) హైదరాబాద్‌ డివిజన్‌ అధ్యక్షులు ఎల్‌.మద్దిలేటి డిమాండ్‌ చేశారు. మహిళా రెజ్లర్లు న్యూఢిల్లీలో నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలకు సంఘీభావంగా యూనియన్‌ మహిళా విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాల్సిన అధికారులు, పాలన యంత్రాంగం కండ్లు మూసుకుని, చేష్టలుడిగి వ్యవహరించడం దారుణమన్నారు. ఇలాంటివి భవిష్యత్తులో పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని, బాధ్యులైన వారిపై కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.
ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన కార్మిక ఉద్యమ నాయకులు పద్మశ్రీ మాట్లాడుతూ.. మహిళా రెజ్లర్లు లైంగిక వేధింపులకు గురై రోడ్డు మీదకు వచ్చి రోజుల తరబడి ధర్నా చేయాల్సి రావడం అత్యంత దారుణమన్నారు. ‘బేటి బచావో-బేటి పడావో’లాంటి ఆకర్షణీయ నినాదాల వరకే పరిమితమవుతున్నాయని, కేంద్ర ప్రభుత్వ పాలకులు ఆచరణ వరకు వచ్చేసరికి పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్నారు. బ్రిజ్‌ భూషణ్‌లాంటి వ్యక్తుల దారుణాలపై సరైన విచారణ జరిపి కఠినంగా శిక్షించి మహిళలకు మనోధైర్యం, భద్రత చేకూర్చే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి జి.తిరుపతయ్య, మహిళా సబ్‌ కమిటీ కన్వీనర్‌ వి.మైథిలి, ఆల్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ ఎంప్లా యీస్‌ అసోసియేషన్‌ నాయకులు, కార్యకర్తలు, సభ్యులు పాల్గొన్నారు.

Spread the love