రోడ్లపై అన్నదాతల ఆవేదన

ధాన్యం కొనుగోలు చేయాలంటూ.. చేసిన ధాన్యాన్ని రైస్‌ మిల్లులకు పంపాలంటూ నర్సాపూర్‌, చేగుంట, తూప్రాన్‌లో రోడ్డెక్కిన రైతన్నలు గంటల తరబడి రాస్తారోకో, ఆందోళన స్తంభించిన ట్రాఫిక్‌ పలువురి అధికారుల హామీలతో విరమణ
నవతెలంగాణ-నర్సాపూర్‌
ఆరుగాలం కష్టపడి పండించాం. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని కంటికి రెప్పొలే పంటను కాపాడుకున్నాం. వర్షం ధాటికి చాలా వరకు పంట దెబ్బతిన్నది. దీంతో మిగిలిన కాసింత పంటను కోసి.. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చాం. రోజులు గడుస్తున్నా కొనుగోలు చేయట్లేదు. ఇటీవలే కురిసిన వర్షాలకు చాలా మంది రైతుల ధాన్యం తడిసిముద్దయింది. అయినప్పటికీ కొనుగోళ్లలో వేగం పెంచలేదు. ధాన్యం సంచుల్లో నింపి తూకానికి సిద్ధంగా ఉన్నప్పటికీ.. లారీల రాకపోవడంతో కేంద్రాల్లోనే ఉంటున్నది. ఉన్నటుండి మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా.. భయాందోళనకు గురికావాల్సి వస్తుంది. కొన్ని చోట్ల ధాన్యం తూకం వేసినప్పటికీ.. రైస్‌ మిల్లులకు తరలించకపోడంతో కొనుగోలు కేంద్రాల్లోనే నెల రోజులుగా ఉంటున్నది. దీంతో వడ్లు మొలకెత్తే ప్రమాదం ఉన్నది. కాబట్టి వెంటనే వడ్లను కొనుగోలు చేయాలి.’ అంటూ రైతన్న రోడ్డెక్కాడు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆందోళన బాట పట్టాడు. శుక్రవారం నర్సాపూర్‌, చేగుంట, తూప్రాన్‌ ప్రాంతాల్లో గంటల తరబడి రహాదారులపై అన్నదాతలు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కాల్చుతూ.. చావుడప్పు కొడుతూ తమ నిరసన తెలిపారు. అధికారుల హామీలతో ఆందోళన విరమించారు.
కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలంటూ వివిధ గ్రామాలకు చెందిన రైతులు శుక్రవారం నర్సాపూర్‌ పట్టణంలోని అంబేద్కర్‌ చౌరస్తాలో ధాన్యాన్ని తగలబెట్టి.. చావు డప్పుకొడుతూ పాటు రాస్తా రోకో, ధర్నా నిర్వహించారు. రెండు గంటల పాటు నిరసన చేపట్టడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి .ఈ విషయం తెలుసుకున్న ఎస్సై శివకుమార్‌ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కాగా కలెక్టర్‌ వచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చేంతవరకు కదిలేది లేదని రోడ్డుపై బైఠా యించారు. దీంతో ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేసే ప్రయత్నం చేయగా.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ డౌన్‌డౌన్‌్‌ అంటూ నినాదాలు చేస్తూ రోడ్డుపైనే బైఠాయించారు. దీంతో తహసీల్దార్‌ ఆంజనేయులుకు ఎస్సై సమాచారం అందించగా.. ఆయన ఘటనా స్థలానికి వచ్చి.. కలెక్టర్‌తో మాట్లాడి కచ్చితంగా సమస్యను తీరుస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు.
కాగా రైతుల నిరసనకు కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆంజనేయులు గౌడ్‌, బీజేపీ అసెంబ్లీ కన్వీనర్‌ వల్దాస్‌ మల్లేష్‌ గౌడ్‌, బీజేపీ రాష్ట్ర నాయకులు రఘువీరారెడ్డి మాట్లాడుతూ.. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిం దన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని తీసుకు వెళ్లేందుకు లారీలు రాక కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం బస్తాలు కుప్పలుగా పేరుకుపోతున్నాయన్నారు. దీంతో రైతులు రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపల కాస్తూ ఇబ్బందులు పడుతున్నారన్నారు. కొనుగోలు కేంద్రాల నిర్వా హకులు రైస్‌ మిల్లర్లు కుమ్మక్కై ఒక్క ధాన్యం బస్తాపై తరుగు పేరిట 8 కేజీలు తీస్తున్నారన్నారు. వెంటనే అధికారులు స్పందించి తరుగు తీస్తున్న వారిపై చర్యలు తీసుకో వాలన్నారు. లేకుంటే రైతుల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌, బీజేపీ పార్టీల నాయకులు. మల్లేశం ,అశోక్‌ గౌడ్‌, సురేష్‌ నాయక్‌, యాదగిరి ,బాల్రాజ్‌, రైతులు ఉన్నారు.
మిల్లులకు తరలించాలంటూ..
నవతెలంగాణ/తూప్రాన్‌ రూరల్‌(మనోహరాబాద్‌)
ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించి నెల రోజులు గడుస్తున్నా.. మిల్లులకు తరలించకపోవడంతో రైతులు రోడ్డుక్కి నిరసన తెలిపారు. ఈ ఘటన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న తూప్రాన్‌లో జరిగింది.
తూప్రాన్‌ మున్సిపల్‌ పరిధిలో పీఏసీఎస్‌, ఐకేపిల ద్వారా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. అయితే ధాన్యాన్ని కోనుగోలు చేసినప్పటికీ.. లారీలు అందు బాటులో లేవంటు ధాన్యాన్ని కేంద్రాల వద్దే ఉంచారు. దీం తో ధాన్యం మొత్తం మొలకలు వచ్చే పరిస్థితి నెలకొన్నదని రైతులు రోడ్డుపైకి వచ్చి నిరసన తెలిపారు. గత నెల రోజుల క్రితం ఏర్పాటు చేసి కేంద్రాల నుంచి కేవలం ఒక్క లారీ ధాన్యాన్ని మాత్రమే తరలించారని రైతులు మండిపడ్డారు. కాగా ఈ విషయమై తూప్రాన్‌ తహసీల్దార్‌ జ్ఞాణజ్యోతిని రైతులు కోరగా.. లారీలు అందుబాటులో లేవని.. మీరు మంత్రిని, ముఖ్యమంత్రిని కలిసినా సరే అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారన్నారు. అలాంటి తహశీల్దార్‌పై చర్యలు తీసుకుని వెంటనే సస్పెండ్‌ చేయాలంటూ రైతులు డిమాండ్‌ చేశారు. పండించిన ధాన్యాన్ని రోడ్డుపై తగలబెట్టి నిరసరన తెలిపినా.. రెవెన్యూ అధికారుల నుంచిి ఏమాత్రం స్పందన లేకపోవడంతో రైతులు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే రైతులకు న్యాయం జరగడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తూప్రాన్‌ ఎస్‌ఐ సురేష్‌ కుమార్‌ ఘటనా స్థలానికి చేరుకుని.. రైతులను సముదాయించారు. దాంతో వెంటనే ఆర్‌ఐ నాగరాజు లారీలను తీసుకువచ్చి ధాన్యాన్ని తరలిస్తున్నట్టు తెలపడంతో రైతులు శాంతించి ఆందోళన విరమించారు.
సకాలంలో లారీలు రాక ఇబ్బంది..
నవతెలంగాణ-చేగుంట
మండలంలోని మక్కారాజుపేట, పులిమామిడి, ఇబ్రహీంపూర్‌ గ్రామాల రైతులు మక్క రాజుపేట టు గజ్వేల్‌ వెళ్లే రహదారి పై గెంటల తరబడి ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఎన్నో ప్రభుత్వాలు మారిన పాలకులు మక్క రాజుపేట, పులిమామిడి గ్రామాల్లో ఐజేపి, పిఎసిఎస్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల వద్ద వేల సంచులు, ధాన్యం సంచులు నింపి, తూకానికి సిద్ధంగా ఉన్నప్పటికీ.. సకాలంలో లారీలు రాక ఇబ్బందులు పడుతున్నట్టు రైతులు తెలిపారు. కొనుగోలు కేంద్రాల ప్రారంభమై నేటికీ సుమారు నెల రోజులు గడుస్తున్నా.. కొనుగోలు కేంద్రాల వద్ద రెండు మూడు లారీలు లోడు అయిన పాపాన పోలేదంటూ వాపోయారు. రైతులు మండుటలను సైతం పక్కనపెట్టి రోడ్లపై ధర్నా రాస్తారోక చేసినా అధికారులు ప్రజాప్రతినిధులు, పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలక్షన్‌ లో టైం లో మేము మీకు ఉన్నామంటూ రైతులకు భరోసా కల్పి స్తామంటూ ఓట్లు వేసుకొని గెలిచి కద్దెనెక్కినాక రైతులను పట్టించుకున్న పాపాన పోతలేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఓపిక నశించి ధాన్యం తగలబెట్టి నిరసనలు వ్యక్తం చేస్తున్నా.. అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందిం చకపో వడం చాలా బాధాకరమని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

Spread the love