అధిష్టానం ఎక్కడ పోటీ చేయమంటే… అక్కడే పోటీ : ఎంపీ కోమటిరెడ్డి

mp komatireddy venkat reddyనవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
అధిష్టానం ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ చేస్తానని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలకు చెందిన నేతలు కాంగ్రెస్‌లో చాలా మంది చేరుతున్నారని గుర్తు చేశారు. తన సోదరుడు రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరిక విషయం తనతో మాట్లాడలేదన్నారు. బుధవారం హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విలేకర్లతో మాట్లాడారు. కాంగ్రెస్‌ రెండో జాబితా పూర్తయిందనీ, గురువారం విడుదల అవుతుందన్నారు. ఆరు స్థానాల్లో మాత్రమే ఇబ్బందులు ఉన్నాయని తెలిపారు. అక్కడ ఇద్దరు ముగ్గురు పోటీ పడుతున్నారని చెప్పారు. కాంగ్రెస్‌ ఎలక్షన్‌ కమిటీ (సీఈసీ) ఫైనల్‌ అయ్యేవరకు బయట మాట్లాడకూడదన్నారు. కర్నాటకలో హామీ ఇచ్చిన పథకాలు అమలు అవుతున్నాయని పేర్కొన్నారు. గతంలోనే కాళేశ్వరంపై విచారణ జరపాలని ప్రధానికి లేఖ రాసినట్టు తెలిపారు. వామపక్షాలకు నాలుగు సీట్లు అంటే తక్కువ కాదనీ, మిర్యాలగూడలో కూడా అడిగారని, అక్కడ ఓటు ఎంత వరకు బదిలీ అవుతుందనేది చూడాలన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి 70 నుంచి 80 సీట్లు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పొత్తులపై బుధవారం సాయంత్రం క్లారిటీ వస్తుందన్నారు. రాహుల్‌ గాంధీ పేరు పలికే అర్హత కేటీఆర్‌కు లేదని చెప్పారు. రాహుల్‌ గాంధీ కుటుంబానికి ఇల్లు కూడా లేదన్నారు. ఇప్పుడు మీ ఆస్తులెంత కేటీఆర్‌ అంటూ కోమటిరెడ్డి ప్రశ్నించారు.

Spread the love