నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంను బీఆర్‌ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మంగళవారం గచ్చిబౌలిలో ఉన్న ఏఐజీ ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఏఐజీ అస్పత్రి వైద్యులను అడిగి మరింత సమాచారాన్ని తెలుసుకున్నారు. తమ్మినేని త్వరగా కోలుకుని ప్రజాక్షేత్రంలోకి రావాలని వద్దిరాజు ఆకాంక్షించారు. గుండె, కిడ్నీ, ఊపిరితిత్తుల సంబంధిత సమస్యతో బాధపడుతున్న తమ్మినేనిని ఈనెల 16న హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చేర్పించిన విషయం తెలిసిందే. వైద్యుల బృందం నిరంతరం పర్యవేక్షిస్తున్నది. ఆస్పత్రిని సందర్శించిన వారిలో టీఎస్‌యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి చావ రవి ఉన్నారు. తమ్మినేనికి వైద్యులు మైనర్ ఆపరేషన్ చేశారని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు బి వెంకట్ తెలిపారు.