నేను బాగానే ఉన్నా..

I'm fine though..– డాక్టర్ల సూచనల రీత్యా కలవలేకపోతున్నా…
– ఏఐజీ ఆస్పత్రి నుంచి తమ్మినేని
– త్వరలోనే సాధారణ కార్యక్రమాల్లో పాల్గొంటానని వెల్లడి
– రాఘవులు, చెరుపల్లి, జూలకంటి, ఎమ్మెల్సీ కవిత సహా పలువురి పరామర్శ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తన ఆరోగ్యం రోజురోజుకూ మరింత మెరుగవుతోందనీ, మానసికంగా, శారీరకంగా తాను బాగానే ఉన్నానని సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. అయితే వైద్యుల సూచనల మేరకు తనను చూసేందుకు వచ్చిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు,ఇతరులను కలవలేకపోతున్నానని ఆయన పేర్కొన్నారు. ఇది కొంత ఇబ్బందికరమేనని అన్నారు. అయితే త్వరలోనే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయి…పార్టీకి సంబంధించిన సాధారణ కార్యక్రమాలన్నింటి లోనూ పాల్గొంటానని ధీమా వ్యక్తం చేశారు. నవతెలంగాణ ఫీచర్స్‌ ఎడిటర్‌ ఆనందాచారి, న్యూస్‌ ఎడిటర్‌ రాంపల్లి రమేశ్‌, బోర్డు సభ్యులు కేఎన్‌ హరి, వేణుమాధవ్‌, బసవపున్నయ్య, బివిఎన్‌ పద్మరాజు, అనంతోజు మోహనకృష్ణ, అజరు ఆదివారం ఉదయం తమ్మినేనిని పరామర్శించేందుకు హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రికి వెళ్లారు. ఆ సమయంలో వైద్యుల సూచనల మేరకు వారు ఆయన్ను కలవలేకపోయారు. నవతెలంగాణ బృందం వచ్చిన విషయాన్ని వెంకట్‌… తమ్మినేనికి తెలిపారు. దీంతో ఆయన పై విధంగా స్పందించారు. మరోవైపు ఆదివారం సాయంత్రం సీపీఐ (ఎం) పొలిట్‌బ్యూరో సభ్యుడు బివి రాఘవులు, కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, బి.వెంకట్‌, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, పి.ప్రభాకర్‌, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తదితరులు తమ్మినేనిని పరామర్శించి, ఆయన ఆరోగ్యం గురించి వాకబు చేశారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Spread the love