ముంబయి విలాపం

ముంబయి విలాపం– 170 ఛేదనలో 145 ఆలౌట్‌
– నైట్‌రైడర్స్‌ ఖాతాలో ఏడో విజయం
– కోల్‌కత 169/10, ముంబయి 145/10
వాంఖడేలో వికెట్ల జాతర. సిక్సర్లు, ఫోర్ల సునామీ కొనసాగుతున్న ఐపీఎల్‌ 17వ సీజన్లో ఓ మ్యాచ్‌లో ఏకంగా 20 వికెట్ల నేలకూలాయి. కోల్‌కత నైట్‌రైడర్స్‌ తొలుత 169 పరుగులకు ఆలౌట్‌ కాగా.. ఊరించే ఛేదనలో ముంబయి ఇండియన్స్‌ 145 పరుగులకే కుప్పకూలింది. 57/5తో పీకల్లోతు కష్టాల్లో కూరుకున్న నైట్‌రైడర్స్‌ను వెంకటేశ్‌ అయ్యర్‌ (70) అర్థ సెంచరీతో ఆదుకోగా.. ఛేదనలో సూర్యకుమార్‌ యాదవ్‌ (56) మెరిసినా సహచరుల మద్దతు లభించలేదు.
నవతెలంగాణ-ముంబయి
170 పరుగుల ఛేదనలో ముంబయి ఇండియన్స్‌ చేతులెత్తేసింది. సూర్యకుమార్‌ యాదవ్‌ (56, 35 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్థ సెంచరీతో మెరిసినా.. ఇషాన్‌ కిషన్‌ (13), రోహిత్‌ శర్మ (11), నమన్‌ దిర్‌ (11), తిలక్‌ వర్మ (4), నెహాల్‌ వదేరా (6), హార్దిక్‌ పాండ్య (1) విఫలమయ్యారు. ఆఖర్లో టిమ్‌ డెవిడ్‌ (24, 20 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్స్‌) ఓటమి అంతరాన్ని కుదించాడు. కోల్‌కత బౌలర్లలో మిచెల్‌ స్టార్క్‌ (4/33), వరుణ్‌ (2/22), నరైన్‌ (2/22), రసెల్‌ (2/20) రాణించారు. అంతకుముందు, బుమ్రా (3/18), తుషార (3/42) దెబ్బకు తొలుత బ్యాటింగ్‌ చేసిన కోల్‌కత నైట్‌రైడర్స్‌ 19.5 ఓవర్లలో 169 పరుగులకు కుప్పకూలింది. వెంకటేశ్‌ అయ్యర్‌ (70, 52 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్థ సెంచరీతో కోల్‌కతను ఆదుకున్నాడు. కోల్‌కత నైట్‌రైడర్స్‌కు ఇది ఏడో విజయం కాగా.. ఎనిమిదో ఓటమితో ముంబయి ఇండియన్స్‌ ప్లే ఆఫ్స్‌ ఆశలను ఆవిరి చేసుకుంది.
ఆదుకున్న అయ్యర్‌ : తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన నైట్‌రైడర్స్‌కు నువాన్‌ తుషార కోలుకోలేని షాక్‌ ఇచ్చాడు. ఫిల్‌ సాల్ట్‌ (5), రఘువంశీ (13) సహా కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (6) వికెట్లతో అదరగొట్టాడు. హార్దిక్‌ పాండ్య ఓవర్లో సునీల్‌ నరైన్‌ (8) వికెట్‌ కోల్పోయాడు. రింకూ సింగ్‌ (9) సైతం నిరాశపరచటంతో 6.1 ఓవర్లలో 57 పరుగులకే నైట్‌రైడర్స్‌ 5 వికెట్లు కోల్పోయింది. స్వల్ప స్కోరుకే పరిమితమయ్యే ప్రమాదంలో పడిన కోల్‌కతను వెంకటేశ్‌ అయ్యర్‌ (70), మనీశ్‌ పాండే (42) ఆదుకున్నారు. ఈ జోడీ ఆరో వికెట్‌కు 62 బంతుల్లో 83 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది. 19.5 ఓవర్లలో ఆలౌటైన కోల్‌కత నైట్‌రైడర్స్‌ 169 పరుగులు చేసింది.

Spread the love