– తెలంగాణ మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయీస్ యూనియన్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అధికారులతో తెలంగాణ మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయీస్ యూనియన్ జరిపిన చర్చలు సఫలమయ్యాయనీ, మంగళవారం నుంచి తలపెట్టిన సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పాలడుగు భాస్కర్, ప్రధాన కార్యదర్శి జనగాం రాజమల్లు తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లోని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలో జాయింట్ డైరెక్టర్ శ్రీధర్ ఆధ్వర్యంలో అధికారులు, యూనియన్ నాయకుల మధ్య చర్చలు జరిగాయి. చర్చల్లో యూనియన్ ప్రతిపాదించిన డిమాండ్లపై సీడీఎంఏ అధికారులు సానుకూలంగా స్పందించారని వారు తెలిపారు. మున్సిపల్ కార్మికులకు ఆంధ్రప్రదేశ్‌లో మాదిరిగా నెలకు రూ.21 వేల జీతం చెల్లించాలనీ, కొత్తగా నియమించిన కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని కోరామని తెలిపారు. జీఓ నెం.60 ప్రకారం కేటగిరీల వారీగా వేతనాలివ్వడం, రెండో పీఆర్సీ సూచించిన ఐఆర్ (మధ్యంతర భృతి)ని అమలు చేయడం, ఇన్సూరెన్స్ కల్పన, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్, తదితర అంశాలను ప్రధానంగా చర్చకు పెట్టామన్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామనీ, ఆర్ధికపరమైన అంశాలను ప్రభుత్వంతో చర్చించి పరిష్కరిస్తామని శ్రీధర్ హామీనిచ్చారని చెప్పారు. చర్చల్లో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె. వెంకటేష్, మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయీస్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్రా నర్సింహులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు టి. ఉప్పలయ్య, డి. కిషన్, సాయిలు, రాష్ట్ర కార్యదర్శి పి. సుధాకర్, టీఎస్ ఎంఆర్‌పిఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు బొట్ల భిక్షపతి, సీఐటీయూ నాయకులు మహేష్, రఘు తదితరులు పాల్గొన్నారు.