త్రిపురలో ప్రజాస్వామ్యం హత్య

– సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో విమర్శ
న్యూఢిల్లీ : త్రిపురలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికలను రద్దు చేసి, కట్టుదిట్టమైన భద్రతా చర్యలతో తాజాగా పోలింగ్‌ నిర్వహించాల్సిందిగా సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో ఎన్నికల కమిషన్‌ను కోరింది. బాక్సానగర్‌, ధన్‌పూర్‌ అసెంబ్లీ నియోజకవర్గాలకు బుధవారం జరిగిన ఎన్నికల్లో పూర్తి స్థాయిలో రిగ్గింగ్‌ జరిగిందని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో ఒక ప్రకటనలో పేర్కొంది. బీజేపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యక్ష పర్యవేక్షణలోనే ఈ రిగ్గింగ్‌ జరిగిందని విమర్శించింది. ఎన్నికల సందర్భంగా ఒక అసాధారణ భయోత్పాత పరిస్థితిని నెలకొల్పారు. సీపీఐ(ఎం) పోలింగ్‌ ఏజెంట్లపై భౌతిక దాడులకు దిగి, వారిని వారి విధులు నిర్వర్తించనీయకుండా అడ్డుకున్నారని పొలిట్‌బ్యూరో విమర్శించింది. బాక్సానగర్‌లో 16మంది, ధన్‌పూర్‌లో 19మంది సీపీఐ(ఎం) పోలింగ్‌ ఏజెంట్లు మాత్రమే బూత్‌ల్లోకి ప్రవేశించగలిగారు. కానీ వారిని కూడా భయభ్రాంతులకు గురి చేసి, విధులు నిర్వర్తించనీయకుండా అడ్డుకుని బయటకు పంపివేశారు. ఈ ఉప ఎన్నికలు ప్రజాస్వామ్య ప్రక్రియకు ఒక ప్రహసనంగా మారాయని పొలిట్‌బ్యూరో విమర్శించింది. స్వేచ్ఛగా, సక్రమంగా ఎన్నికలు నిర్వహించాలన్న ఎన్నికల కమిషన్‌ ఆదేశాలను దారుణంగా ఉల్లంఘించిన వారితో కుమ్మక్కైన అధికారులందరినీ తాజా ఎన్నికల సమయంలో ఎన్నికల విధుల్లో నియమించరాదని పొలిట్‌బ్యూరో పేర్కొంది. భయోత్పాతాన్ని సృష్టించడానికి బాధ్యులైన వారిని గుర్తించి, శిక్షించాలని కోరింది.

Spread the love