మటన్‌, మంగళసూత్రాలే మీ ప్రచారాస్త్రాలా?

Mutton and Mangalasutra Your campaign?– అభివృద్ధి గురించి ఎందుకు మాట్లాడరు?
– కాంగ్రెస్‌ను విమర్శించడం ద్వారానే ఓట్లు అడుగుతున్నారు
– టెంపోల్లో డబ్బు తరలిస్తుంటే, బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తోంది ?
– తెలంగాణకు ఏమిచ్చారో మోడీ చెప్పాలి : కాషాయ పార్టీపై ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఫైర్‌
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
పదేండ్లలో బీజేపీ ప్రభుత్వం దేశానికి చేసిన అభివృద్ధి ఏంటో చెప్పకుండా మొఘలుల మటన్‌, హిందువుల మంగళసూత్రాలు, ముస్లిం రిజర్వేషన్లనే ప్రచార అస్త్రాలుగా ఎంచుకుందని ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే ఎద్దేవా చేశారు. ప్రధాని మోడీ దేశాన్ని అభివృద్ధి చేయకపోగా…దాన్నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. చేసిన పనులను చెప్పి ఓట్లు అడిగే ధైర్యంలేని మోడీ…కాంగ్రెస్‌ను విమర్శించడం ద్వారా ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు అంబానీ, అదానీలు టెంపోల్లో డబ్బులు ముట్టజెపుతున్నారనీ, తమ పార్టీ వాళ్లు టెంపోల్లో డబ్బులు పంచుతున్నారంటూ ఆయన మరో అబద్ధపు ప్రచారాన్ని తెరపైకి తెచ్చారనీ, డబ్బు తరలిస్తుంటే కేంద్ర ప్రభుత్వ సంస్థలేం చేస్తున్నాయని నిలదీశారు. శుక్రవారం హైదరాబాద్‌ లోని ఓ ప్రముఖ హోటల్‌లో రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జీ దీపాదాస్‌ మున్షీ, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఏఐసీసీ నేతలు నాసర్‌ హుస్సేన్‌, మన్సూర్‌ అలీ, రాష్ట్ర నాయకులు మధుయాష్కీగౌడ్‌, జే గీతారెడ్డి, ప్రొటోకాల్‌ చైర్మెన్‌ హర్కర వేణుగోపాల్‌, మీడియా కమిటీ చైర్మెన్‌ రామ్మోహన్‌రెడ్డితో కలిసి ఖర్గే విలేకర్లతో మాట్లాడారు. తెలంగాణకు వచ్చిన ప్రధాని మోడీ ఈ రాష్ట్రానికి పెద్ద ప్రాజెక్టు ఏమి ఇచ్చారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలమేరకు పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ‘బీజేపీ మాత్రం అభివృద్ధి గురించి చెప్పి ఓట్లు అడగదు. కాంగ్రెస్‌పై నిందలు మోపడం ద్వారా ఆ పార్టీ నేతలు ఓట్లు అడుగుతారు. హస్తం పార్టీ తమకు పోటీయే కాదంటూనే పదేపదే బీజేపీ మాపై విమర్శలు చేస్తున్నది. మా పార్టీకి భయపడుతున్నందునే పదేపదే ఆరోపణలు చేస్తున్నారు. నల్లధనం వెలికితీస్తామని ఎన్నో ప్రగల్భాలు పలికారు. దాని ప్రయోజనాలను వారి మిత్రులకే అందజేశారు’ అని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ధనవంతుల ఆస్తులు లాక్కుని పేదలకు పంచుతారంటూ మోడీ దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఉందన్న విషయాన్ని ప్రధాని గుర్తించాలని ఆయన కోరారు. దేశాభివృద్ధిని మోడీ గాలికొదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోని ప్రతీ పేద మహిళకు రూ.లక్ష ఆర్థికసాయం అందజేస్తామని పునరుద్ఘాటించారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. ఇండియా కూటమి అధికారంలోకి రావడంతోనే రైతుల పంటలకు కనీస మద్దతు ధర కల్పిస్తామన్నారు. ఎన్నికల కోడ్‌ ముగిసిన వెంటనే రాష్ట్రంలో మిగతా పథకాలన్నింటినీ అమలు చేస్తామని వాగ్దానం చేశారు. ఇప్పటికైనా బీజేపీ నేతలు తమ ఎన్నికల మ్యానిఫెస్టోపై మాట్లాడాలని సవాల్‌ విసిరారు. ఇందిరాగాంధీ భూ సంస్కరణలు చేపట్టారనీ, బ్యాంకులను జాతీయం చేశారని తెలిపారు. ఇండియా కూటమి అధికారంలోకి రాగానే కేంద్ర ప్రభుత్వంలోని ఖాళీ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. దేశవ్యాప్తంగా కులగణన చేసి, తదనుగుణంగా రిజర్వేషన్లను నిర్ణయిస్తామన్నారు. ఐఏఎస్‌, ఐపీఎస్‌,ఐఎఫ్‌ఎస్‌ల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలు చాలా తక్కువగా ఉన్నారంటూ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కేంద్ర ప్రభుత్వం హైదారాబాద్‌ను నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. హైదారాబాద్‌, బెంగళూరు, ముంబాయికి రావాల్సిన పెట్టుబడిదారులను బెదిరించి గుజరాత్‌ రాష్ట్రానికి తరలించారని ఈ సందర్భంగా ఖర్గే ఆరోపించారు. ‘పువ్వులు పొద్దున పూస్తాయి. సాయంత్రం అవి (బీజేపీ గుర్తు కమలం పువ్వు) వాడిపోతాయి. చెయ్యి ఎప్పుడు మీతోనే ఉంటుంది. మోడీ చెప్పే అబద్ధాలను నమ్మి ఓట్లు వేస్తే మోసపోతారు’ అని హెచ్చరించారు. ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణపై కర్నాటక ప్రభుత్వం సిట్‌ బృందాన్ని ఏర్పాటు చేసిందనీ ఆ నివేదిక రాగానే ఆయనపై చర్యలు తీసుకుంటుందని వివరించారు. తన అల్లుడిపై వచ్చిన రూ. 500 కోట్ల ఆరోపణలపై స్పందిస్తూ విచారణ జరిపించి దోషిగా తేలితే శిక్ష వేయాలని సూచించారు.

Spread the love