వన్యప్రాణులకు నిలయం… నాగార్జునసాగర్ ఏకో అర్బన్ పార్క్

– చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్న ఏకో పార్క్
– అడవిలో జలం.. వన్యప్రాణులకు అభయం
– వేసవిలో జంతువుల దాహార్తి తీర్చేందుకు నీటి కుంటలు
– అవసరాన్ని బట్టి సోలార్‌ బోర్ల ఏర్పాటు
– వేటగాళ్లను కట్టడి చేసేందుకు సీసీ కెమెరాలు
– అటవీప్రాంతంపై నిఘాకు బేస్‌క్యాంపులు
– ఎప్పటికప్పుడు తొట్లలో నీటిని నింపుతున్న అటవీ శాఖ అధికారులు
– వేసవిలో వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు
నవతెలంగాణ నాగార్జునసాగర్:
ప్రపంచంలోనే అతిపెద్ద మానవ నిర్మితంగా ఉన్న నాగార్జునసాగర్ ప్రాజెక్టు, పవర్ హౌజ్, రిజర్వాయర్, బుద్ధుడు నడయాడిన నేల బుద్దవనం, నాగార్జున కొండ, మ్యూజియం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. దీనితో నూతనంగా నల్లమల అటవీ ప్రాంతంలో ప్రకృతి ప్రేమికులు కృష్ణమ్మ సోయగాలు తిలకించేందుకు, ప్రకృతిని ఆస్వాదించేందుకు 1.5కోట్లతో అబ్రాబాద్ టైగర్‌ రిజర్వ్‌ వన్యప్రాణుల అటవీకోర్‌ ఏరియాలో ఏకో అర్బన్‌ పార్కు, సఫారీ ట్రిప్‌ లను నాగార్జునసాగర్‌-హైదరాబాద్‌, నాగార్జున సాగర్‌-నల్లగొండ రహదారుల (సమ్మక్క-సారక్కల) వెంట నెల్లికల్లు వద్ద 100 ఎకరాల విస్తీర్ణంలో పర్యాటకులను ఆకట్టుకునేలా అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. నాగార్జునసాగర్ సమ్మక్క సారక్క వద్ద నుండి 11కిలోమీటర్ల మేర రోడ్ల వెంబడి సఫారీ వాహనంలో నల్లమల ఎత్తైన గుట్టల్లోంచి పచ్చని వృక్షాల మధ్య ప్రయాణించి సాగర్‌ జలాశయం వెనుక వైపున గల అందాలను పర్యాటకులు తిలకించేందుకు నెల్లికల్లు అటవీ ప్రాంతంలో వాచ్ టవర్, వ్యూపాయింట్‌ను ఏర్పాటు చేశారు. సందర్శకులు జంతు కార్యకలాపాలు, సరీసృపాలు గుర్తించడం, పక్షులను చూడగలిగేలా సఫారీ మార్గమును రూపొందించబడింది.పర్యాటకులు, ప్రకృతి ప్రేమికులకు ఏకో అర్బన్ పార్క్ మరింత కనువిందు చేయనుంది.


వేసవిలో వన్యప్రాణుల దాహం తీర్చడానికి సాగర్ ఫారెస్ట్ అధికారులు పక్కా ప్రణాళిక
వేసవిలో వన్యప్రాణుల సంరక్షణకొరకు, దాహం తీర్చడానికి సాగర్ ఫారెస్ట్ అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. అసలే ఎండాకాలం ఏడాది ప్రారంభం నుండే ఎండలు మండుతుండటం అడవుల్లో నీటి వనరులు ఎండిపోతుండడంతో జంతువులు దప్పికతో అలమటిస్తుంటాయి. ఈ క్రమంలో నాగర్జున సాగర్ అమ్రాబాద్ ఫారెస్ట్ రేంజ్ లో వన్యప్రాణుల సంరక్షణకు అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వేసవి నేపథ్యంలో పక్కా ప్రణాళిక ప్రకారం నాగార్జునసాగర్ ఫారెస్ట్ అధికారులు ముందుకుసాగుతున్నారు. వన్యప్రాణుల దాహార్తిని తీర్చడం కోసం అడవుల్లో కృత్రిమంగా నీటివనరులను ఏర్పాటు చేస్తున్నారు. అడవిలో రకాల జీవులు సంచరిస్తుంటాయి. ఎండాకాలంలో నీటి కోసం ప్రత్యేకంగా నీటి గుంటలు, సోలార్ బోర్ ఏర్పాటు చేసి వన్యప్రాణులు ఎక్కువగా సంచరించే ప్రాంతాలు, నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రదేశాలను గుర్తించి వాటి నిర్మాణం చేపట్టారు. మరో వైపు వన్యప్రాణుల వేటగాళ్లపై దృష్టిసారించారు. నీటివనరుల వద్ద వేటగాళ్ల ఉచ్చులకు వన్యప్రాణులు బలికాకుండా ఉండేందుకు నిరంతరం గస్తీ, వాచ్ టవర్స్, కెమెరా ట్రాప్స్ ఏర్పాటు చేశారు.అడవిలో అడవి దున్న, ముళ్లపందులు, జింకలు, నీల్ గాయ్, దుప్పులు, అడవి కోళ్ళు, నెమళ్ళు, కుందేలు,అడవి పందులు మొదలగు జీవ జాతులు సంచరిస్తుంటాయి. ఎండాకాలంలో నీటి కోసం అడవిలో నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రదేశాల్లో, వన్యప్రాణులు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో వీటిని నిర్మాణం చేపట్టిన్నట్టు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. వన్యప్రాణులకు అడవిలో నీటిని అందించడంతో నీటి జాడలు వెతుక్కుంటూ గ్రామాల్లోకి వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని, నీటి లభ్యత ఉన్న చుట్టుపక్కల గడ్డిమొలిచి ఎండాకాలంలో ఆహార లభ్యత కూడా మెరుగయ్యే అవకాశం ఉంటుంది. వన్యప్రాణుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండడంతో వాటి సంరక్షణకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

వేటగాళ్ల పై ప్రత్యేక కన్ను….సర్వేశ్వర్…ఫారెస్ట్ డివిజన్ అధికారి
ప్రతి యేడాది వన్యప్రాణుల దాహార్తి తీర్చడం కోసం అటవీశాఖ అధికారులు నీటి కుంటలను ఏర్పాటు చేయడంతో వాటి పరిసర ప్రాంతాల చుట్టూ జీవాల ఉనికి ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో ఆ ప్రదేశాలపై వేటగాళ్లు దృష్టి సారించారు. ఇదే అదునుగా నీటి కుంటల చుట్టూ అడవి జంతువులు తిరిగే ప్రదేశాల వద్ద ఉచ్చులు ఏర్పాటుచేస్తున్నారు. నీటి కుంటల చుట్టుపక్కల వేటను కొనసాగిస్తూ అటవీ జంతువులపై దాడులు నిర్వహిస్తున్నారు. వేటగాళ్లకు జంతువులు బలికాకుండా దృష్టి అటవీశాఖ అధికారులు చర్యలు చెపడుతున్నాం. నాగార్జునసాగర్ నల్లమల అటవీ ప్రాంతంలో ప్రకృతి ప్రేమికులు కృష్ణమ్మ సోయగాలు తిలకించేందుకు, ప్రకృతిని ఆస్వాదించేందుకు సఫారీ ట్రిప్ సఫారీ వాహనంలో వ్యూపాయింట్‌ వరకు ఉన్న ఐదు కిలోమీటర్ల దూరం ప్రయాణించినందుకు రూ.1000, వ్యూపాయింట్‌ నుంచి సహజ అడవిలో మొత్తం 12 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే రూ.1500ల టికెట్‌ ధరలు నిర్ణయించామన్నారు. సఫారీ వాహనంలో ఎనిమిది మంది కూర్చునేందుకు వీలుంటుందని, రోజూ ఈ ట్రిప్పులు ఉదయం ఆరు గంటల నుంచి 10 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం నాలుగు గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు ఉంటాయన్నారు. పర్యాటకులు ప్రకృతి ప్రేమికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
నీటి కుంటల చుట్టూ నిఘా..- రాఘవేందర్ రావు‌, ఫారెస్ట్ రేంజ్ అధికారి
అడవి జంతువుల నీటి అవసరాల కోసం శాశ్వత, తాత్కాలిక ఏర్పాట్లు పూర్తి చేశాం. సోలార్ నీటి పంపులు, సాసర్ పిట్స్, చెక్ డ్యాంలు నిర్మించి ఎప్పుడు నీరు ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. అటవీ రక్షణ కోసం వాచ్ టవర్స్, అక్కడక్కడ కెమెరా ట్రాప్స్ ఏర్పాటు చేశాం. నీటి వనరుల చుట్టూ 24 గంటలు ఫారెస్ట్ సిబ్బందితో గస్తీ నిర్వహిస్తున్నాం. అటవీ జంతువులు వేటగాళ్ల బారిన పడకుండా గట్టి నిఘా ఏర్పాటు చేశాం.

వన్య ప్రాణులు తాగేందుకు సాసర్‌పిట్‌లు… రమేష్..ఎఫ్.ఎస్.ఓ
వన్య ప్రాణులకు ఎండాకాలంలో తాగునీటికి ఇబ్బంది ఏర్పడకుండా సాసర్‌పిట్‌లు ఏర్పాటు చేశాం. వాటిలో ట్రాక్టర్ల సాయంతో నీటితో నింపుతున్నాము వేసవిలో అడవిలో సహజంగా ఉండే నీటి వనరులు ఎండిపోతాయి. దీంతో వన్యప్రాణులకు తాగునీటి సమస్య తలెత్తకుండా అన్ని చర్యలు చేపడుతున్నాం. సాసర్‌పిట్ల వద్ద కెమెరాలు అమర్చాం.

Spread the love