కాంగ్రెస్‌ చేతికి నల్లగొండ డీసీసీబీ

కాంగ్రెస్‌ చేతికి నల్లగొండ డీసీసీబీ– నెగ్గిన అవిశ్వాసం
– నూతన చైర్మెన్‌గా శ్రీనివాస్‌ రెడ్డి !
– మహేందర్‌ రెడ్డికి వ్యతిరేకంగా 15 మంది డైరెక్టర్ల ఓటు
– సోమవారం చైర్మెన్‌ ఎన్నిక
నవతెలంగాణ-నల్గొండ కలెక్టరేట్‌
నల్లగొండ జిల్లా డీసీసీబీ చైర్మెన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డిపై డైరెక్టర్లు పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన డీసీసీబీ చైర్మెన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డిపై అవిశ్వాస తీర్మానం కోరుతూ.. 14 మంది డైరెక్టర్లు ఈనెల 10వ తేదీన జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలోని డీసీఓ కార్యాలయంలో డీసీఓ కిరణ్‌ కుమార్‌కు లేఖ అందజేశారు. దాంతో, శుక్రవారం ఉదయం 11 గంటలకు నల్లగొండ డీసీసీబీ కార్యాలయంలో అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌ నిర్వహించారు. 15 మంది డైరెక్టర్లు మహేందర్‌ రెడ్డికి వ్యతిరేకంగా ఓటు వేశారు. దీంతో అవిశ్వాస తీర్మానం నెగ్గింది. మహేందర్‌ రెడ్డి తన చైర్మెన్‌ పదవిని కోల్పోయారు. నూతనంగా చైర్మెన్‌ బాధ్యతలను కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కుంభం శ్రీనివాస్‌ రెడ్డి చేపట్టే అవకాశం ఉంది. కొత్త చైర్మెన్‌ ఎన్నిక జరిగే వరకు, ప్రస్తుతం వైస్‌ చైర్మెన్‌గా కొనసాగుతున్న దయాకర్‌రెడ్డి ఇన్‌చార్జి చైర్మెన్‌గా వ్యవహరించనున్నారు.
ఎలాంటి రాజకీయ కోణమూ లేదని డైరెక్టర్‌ కుంభం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. అవిశ్వాస తీర్మానం నెగ్గిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. నల్లగొండ డీసీసీబీలో మరోసారి కాంగ్రెస్‌ పార్టీ జెండా ఎగిరిందన్నారు. రాజకీయాలకతీతంగా రైతు సంక్షేమమే ధ్యేయంగా బ్యాంకును ముందుకు తీసుకుపోతామన్నారు. రైతులకు అన్ని విధాలుగా సహాయ, సహకారాలు అందిస్తామని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉందనో బీఆర్‌ఎస్‌ ప్రతిపక్షంలో ఉందనో అవిశ్వాసం పెట్టలేదన్నారు. కేవలం మహేందర్‌ రెడ్డి ఒంటెద్దు పోకడలు, అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా అవిశ్వాసం పెట్టామని చెప్పారు. ఈ సమావేశంలో డీసీసీబీ డైరెక్టర్లు ఎసిరెడ్డి దయాకర్‌ రెడ్డి, పాశం సంపత్‌ రెడ్డి, అంజయ్య, గుడిపాటి సైదులు, వీరస్వామి, కొండా సైదులు, కోడి సుష్మ, కరుణ, అనురాధ, అందేల లింగయ్య యాదవ్‌, రామచంద్రయ్య, జూలూరు శ్రీనివాస్‌, జయరాం నాయక్‌, బంటు శ్రీను, డీసీసీ అధ్యక్షుడు కేతావత్‌ శంకర్‌ నాయక్‌, మున్సిపల్‌ చైర్మెన్‌ బుర్రి శ్రీనివాస్‌ రెడ్డి, వైస్‌ చైర్మెన్‌ అబ్బగోని రమేష్‌ గౌడ్‌, మార్కెట్‌ కమిటీ చైర్మెన్‌ జూకూరి రమేష్‌ పాల్గొన్నారు.

Spread the love