Tuesday, July 14, 2026
E-PAPER
Homeరాష్ట్రీయండంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా జాతీయ రహదారి దిగ్బంధం

డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా జాతీయ రహదారి దిగ్బంధం

- Advertisement -

బైటాయించిన డంపింగ్ యార్డు ప్రభావిత గ్రామాల ప్రజలు
641 జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ ​
పోలీసులు, ప్రజలకు మధ్య వాగ్వివాదం.. పరిస్థితి ఉద్రిక్తం
ప్రభుత్వంపై ప్రజల ఆగ్రహం
మద్దతు తెలిపిన అధికార, ప్రతిపక్ష‍ పార్టీల నేతలు

​ నవతెలంగాణ-కొత్తూరు
రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం సిద్ధాపూర్‌‌లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చూస్తున్న డంపింగ్‌ ‌యార్డుకు వ్యతిరేకంగా సోమవారం ప్రజా ఉద్యమం ఉవ్వెత్తున ఎగసింది. బాధిత గ్రామాల ప్రజలు జాతీయ రహదారి-44ను దిగ్బంధించారు. గంటన్నర పాటు రోడ్డుపై బైటాయించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘641 జీవోను వెంటనే రద్దు చేయాలి.. సీఎం డౌన్ డౌన్.. నమ్మి గెలిపిస్తే మా బతుకులపై చెత్త వేస్తావా.. చెత్త తీస్తావా చావాలా..’ అంటూ డంపింగ్ యార్డు బాధిత గ్రామాల ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వీరికి కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ(ఎం), బీఆర్‌ఎస్‌ మద్దతు తెలిపాయి. ముందుగా రైతులు, యువకులు, మహిళలు, వృద్ధులు చిన్న పెద్ద తేడా లేకుండా సిద్ధాపూర్ నుంచి బయలు దేరి కొత్తూరుకు చేరుకున్నారు. సిద్దాపూర్‌‌లో సీఐ నర్సయ్య ఆధ్వర్యంలో వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించినా భారీ సంఖ్యలో ప్రజలు ఉండటంతో వారిని ఆపలేకపోయారు. ఒక్కసారిగా సుమారు 2వేల మంది జాతీయ రహదారిపైకి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తం గా మారింది. రోడ్డుపై సుమారు 10 కిలోమీటర్ల మేర అటు, ఇటుగా వాహనాలు నిలిచిపో యాయి. దాంతో డీసీపీ శిరీష, ఏసీపీ లక్ష్మీ నారాయణ, సీఐ నర్సయ్య భారీ బందో బస్తు ఏర్పాటు చేశారు. ఆందోళనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు ససేమీరా అన్నారు. జేఏసీ చైర్మెన్‌ అంబటి ప్రభాకర్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు యెల్లారం శేఖర్ రెడ్డి రోడ్డుపై బైటాయించడంతో వారి చుట్టూ భారీ సంఖ్యలో ప్రజలు రక్షణగా నిలిచారు. పోలీసులు వారిని అరెస్టు చేసేందుకు శతవిధాలుగా ప్రయత్నించినా మహిళలు వారి ప్రయత్నాలను తిప్పి కొట్టారు. కొంతమందిని అరెస్టు చేసే ప్రయత్నం చేయగా.. డీసీఎంకు మహిళలు అడ్డుపడి వాహనాన్ని కదలనివ్వలేదు. అంతకుముందు సిద్ధాపూర్‌‌లో జరిగిన కార్యక్రమంలో జేఏసీ చైర్మెన్‌ అంబటి ప్రభాకర్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు యెల్లారం శేఖర్ రెడ్డి, బీజేపీ నాయకులు అందే బాబయ్య, నెల్లి శ్రీవార్ధన్ రెడ్డి, సీపీఐ(ఎం) నాయకులు సాయిబాబు, బీఆర్ఎస్ నాయకులు రమేష్ కురుమలు మాట్లాడారు. ‘ముఖ్యమంత్రి గారు మీకు ఇది న్యాయమేనా.. కడుపులో పెట్టుకొని మమ్మల్ని కాపాడుతావని నీకు ఓటు వేసి గెలిపిస్తిమి.. నిన్ను నమ్మిన పాపానికి మా బతుకుల మీద చెత్త కుప్పను వేస్తారా..’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 641 జీవోను వెంటనే రద్దు చేయకపోతే సీఎం ఇల్లు ముట్టడి చేస్తామని హెచ్చరించారు.
‘మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకూ వదిలే ప్రసక్తి లేదు. మా బతుకులు బాగు చేయకపోయినా పర్వాలేదు. డంపింగ్ యార్డుతో మా బతుకులు నాశనం చేయొద్దు. డంపింగ్ యార్డు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి. లేదంటే ప్రాణాలు పణంగా పెట్టయినా సరే డంపింగ్ యార్డును అడ్డుకుంటాం’ అని హెచ్చరించారు. జాతీయ రహదారిపై గంటన్నర పాటు బైటాయించిన అనంతరం ఆందోళన వివరించారు. నిరసన శాంతియుతంగా ముగియడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
అనంతరం మండల తహసీల్దార్‌ కార్యాలయానికి చేరుకొని అక్కడ ఆర్డీవో సరితకు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు ఎర్రోళ్ల జగన్, చేపంగి ప్రవీణ్, బాసు నాయక్, గోవింద్ నాయక్, కొర్ర శాంతి విష్ణు నాయక్, ఉప్పల దయానంద్ గుప్తా, బోకుల శ్రీరాములు, కాంగ్రెస్ మున్సిపాలిటీ అధ్యక్షులు జాడగూడ సుదర్శన్ గౌడ్, మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్, మహిళలు, యువకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -