16న దేశవ్యాప్త సమ్మె, గ్రామీణ బంద్‌

Nationwide strike on 16th Gramin Bandh– ప్రజలంతా జయప్రదం చేయాలి : సీఐటీయూ జాతీయ అధ్యక్షులు డాక్టర్‌ కె.హేమలత
– ఫెడరలిజం స్థానంలో నియంతృత్వం
– గవర్నర్ల వ్యవస్థతో రాష్ట్రాల హక్కుల హరణ
– కేంద్రం తీరుపై 8న జంతర్‌మంతర్‌ వద్ద కేరళ సీఎం పినరయి విజయన్‌ నిరసన : వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న మతతత్వ, కార్పొరేట్‌ అనుకూల, కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 16న దేశవ్యాప్తంగా పారిశ్రామిక వాడల్లో తలపెట్టిన సెక్టోరియల్‌ సమ్మెను, గ్రామీణ బంద్‌ను జయప్రదం చేయాలని సీఐటీయూ అఖిల భారత అధ్యక్షులు డాక్టర్‌ కె.హేమలత పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీఐటీయూ, అఖిల వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..దేశంలో రోజురోజుకీ నిత్యావసరాల ధరలు, నిరుద్యోగ సమస్యలు తీవ్రం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికుల హక్కులపై మోడీ సర్కారు దాడి చేస్తున్నదనీ, దీంతో కార్మికులు ఉద్యోగ భద్రతను కోల్పోతున్నారని చెప్పారు. అదే సమయంలో నిజవేతనాలు కూడా పడిపోతున్నాయని వాపోయారు. మతం, కులం పేరుతో ప్రజల్ని చీల్చి తన విధానాలను బీజేపీ అమలు చేసుకుంటూ పోతున్నదని విమర్శించారు. మోడీ సర్కార్‌ అనుసరిస్తున్న ప్రజా, కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ 16న జరిగే సమ్మెను, గ్రామీణ బంద్‌ను జయప్రదం చేయాలని కోరారు. అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌ మాట్లాడుతూ..కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను హరించివేస్తున్నదని విమర్శించారు. ఫెడరలిజం స్థానంలో నియంతృత్వ పాలనను కొనసాగిస్తున్నదని చెప్పారు. బీజేపీ యేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్‌ వ్యవస్థను అడ్డుపెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వాలను ఆర్థికంగా వేధిస్తున్నదని విమర్శించారు. గవర్నర్ల వ్యవస్థను తమ చేతుల్లోకి తీసుకోవడాన్ని తప్పుబట్టారు. రాజ్యాంగాన్ని రక్షించుకుందాం..ఫెడరలిజాన్ని రక్షించుకుందాం నినాదంతో కేరళ సీఎం పినరయి విజయన్‌ ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద ఈ నెల 8న తలపెట్టిన నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి రాష్ట్రంలోనూ సంఘీభావంగా ప్రదర్శనలు చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తుంటే కేరళ ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నదని ఉదహరించారు. త్రివేండ్రం ఎయిర్‌పోర్టును ఆదానీ గ్రూపునకు అప్పగించడాన్ని నిరసిస్తూ కేరళ ప్రభుత్వం సుప్రీం కోర్టులో కేసులు వేసిందని తెలిపారు. కేరళలోని ప్రజా మోడల్‌ పాలనను అమలు చేస్తుంటే..ప్రధాని మోడీ సొంతరాష్ట్రమైన గుజరాత్‌లో కార్పొరేట్‌ మోడల్‌ పాలనను అమలు చేస్తున్నారని విమర్శించారు. ఇది కేరళపైనే కాదు..అన్ని రాష్ట్రాల హక్కులపై జరుగుతున్న దాడిగా పరిగణించాలని కోరారు. రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్‌ మాట్లాడుతూ.. అన్ని రాజకీయ పార్టీలు, మేధావులు, సామాజిక వేత్తలు 16న జరిగే గ్రామీణ బంద్‌కు మద్దతు తెలపాలని కోరారు. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోడీ సర్కారు మోసం చేస్తున్నదని విమర్శించారు. కనీస మద్దతు ధర చట్టాన్ని ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు. రుణమాఫీ, ఎరువుల సబ్సిడీ విషయంలో పూర్తిగా రైతులకు అన్యాయం చేసిందని విమర్శించాయి. ప్రజలకు, రైతులకు నష్టం చేసే విద్యుత్‌ సవరణ బిల్లును చర్చ పెట్టకుండా ఆమోదించుకోవడాన్ని తప్పుబట్టారు. ఈ సమావేశంలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌, ఉపాధ్యక్షులు భూపాల్‌, కార్యదర్శి జె.వెంకటేశ్‌, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌.వెంకట్రాములు, ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్‌, రైతు సంఘం సహాయకార్యదర్శి ఎం.శోభన్‌, తదితరులు పాల్గొన్నారు.

Spread the love