ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంస్థగా ఎన్‌సిఇఆర్‌టి

నవతెలంగాణ – న్యూఢిల్లీ :  2014 నుండి ఎన్‌సిఇఆర్‌టి ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంస్థగా పనిచేస్తోందని కాంగ్రెస్‌ నేత జైరాం రమేష్‌ సోమవారం విమర్శించారు.  పెద్ద ఎత్తున రాజ్యాంగంపై దాడికి దిగుతోందని మండిపడ్డారు. నీట్‌ 2024 ఫలితాల్లో గ్రేస్‌ మార్కులపై ఎన్‌సిఇఆర్‌టిని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజన్సీ (ఎన్‌టిఎ) తప్పుపట్టిందని ఎక్స్‌లో తెలిపారు. ఈ చర్య ఎన్‌టిఎ సొంత వైఫల్యాల నుండి దారి మళ్లించేందుకేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్‌సిఇఆర్‌టి వృత్తిపరమైన సంస్థ కాదన్నది వాస్తవమని, 2014 నుండి ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంస్థగా పనిచేస్తోందని ధ్వజమెత్తారు. సవరించిన 11వ తరగతి పొలిటికల్‌ సైన్స్‌లో లౌకికవాదం అంశాన్ని తప్పుగా పేర్కొందని, రాజకీయ పార్టీల విధానాలను పరిగణనలోకి తీసుకుందని అన్నారు. లౌకికవాదం భారత గణతంత్ర రాజ్యానికి మూల స్తంభంగా పేర్కొన్న రాజ్యాంగ ప్రవేశికపై ఎన్‌సిఇఆర్‌టి దాడికి దిగుతోందని మండిపడ్డారు. రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణంలో లౌకిక వాదం ముఖ్యమైన భాగమని సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో స్పష్టం చేసిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఎస్‌ఇఆర్‌టి లక్ష్యం పాఠ్యపుస్తకాల రూపొందించడమని, రాజకీయ పార్టీల కరపత్రం, ప్రచారాలను తయారు చేయడం కాదని అన్నారు. ఎన్‌సిఇఆర్‌టి అంటే ‘నాగపూర్‌ లేదా నరేంద్ర కౌన్సిల్‌ ఫర్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌’ కాదని ఎద్దేవా చేశారు.ఎన్‌డిఎ1.0 ప్రభుత్వం తమకు అనుకూలంగా లేవని వాస్తవాలను విద్యార్థులకు బోధించకుండా దాచిపెట్టడం సిగ్గుచేటని టిఎంసి నేత సాకేత్‌ గోఖలే విమర్శించారు. ఈ లాజిక్‌ ప్రకారం .. హింసాత్మక, అణచివేయబడిన అంశాలైన వరల్డ్‌ వార్‌ గురించి కూడా ప్రస్తావించకూడదని అన్నారు. నేరపూరిత వ్యక్తులు, తిరుగుబాటుదారులుగా బిజెపి, మోడీ చరిత్రకెక్కడం సిగ్గు చేటని, విద్యార్థుల నుండి వాస్తవాలను ఎందుకు దాచిపెడుతున్నారని అన్నారు.

Spread the love