నీట్‌ పరీక్షను రద్దు చేయాలి

నీట్‌ పరీక్షను రద్దు చేయాలి– విద్యార్థి సంఘాల ఆందోళన..ఎంపీ డీకే అరుణ ఇంటి ముట్టడి
నవతెలంగాణ -మహబూబ్‌నగర్‌
నీట్‌ పరీక్ష పేపర్‌ లీకేజీ విషయంలో నిర్లక్ష్య ధోరణిని నిరసిస్తూ ఎస్‌ఎఫ్‌ఐ, ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో శనివారం మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ ఇంటిని ముట్టడించారు. పద్మావతి కాలనీ పెట్రోల్‌ బంక్‌ నుంచి విద్యార్థి సంఘాల నాయకులు ర్యాలీగా డీకే అరుణ ఇంటి ముట్టడికి బయలుదేరారు. ఈ క్రమంలో పోలీసులు అడ్డుకున్నారు. అక్కడ బీజేపీ నాయకులు, విద్యార్థి సంఘాల నాయకుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. పోలీసులు జోక్యం చేసుకొని విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేసి ఒకటో పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ప్రశాంత్‌, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర కార్యదర్శి రమేష్‌ మాట్లాడుతూ.. నీట్‌ పరీక్షపై పార్లమెంటులో ఎంపీ డీకే అరుణ మాట్లాడాలని డిమాండ్‌ చేశారు. దేశవ్యాప్తంగా 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్‌కు సంబంధించిన విషయమని, కేంద్రంలో ఉన్న బీజేపీి ప్రభుత్వం విద్యార్థుల గురించి ఆలోచించడం లేదని విమర్శించారు. నీట్‌ పరీక్షను రద్దు చేసి తిరిగి మళీ ఎగ్జామ్‌ నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. నీట్‌ పేపర్‌ లీకేజీలో బీజేపీ నేతల హస్తం ఉందని విమర్శించారు. ఎన్‌టిఏను రద్దు చేసే వరకు పోరాటం ఆగదన్నారు. లేకపోతే పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు భరత్‌, ఉపాధ్యక్షుడు నందు, ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు పాల్గొన్నారు.

Spread the love