నా మనసునెప్పుడూ మరువద్దు

నా మనసునెప్పుడూ మరువద్దునా మనసును మోసే ఇష్టంతో
నీలో మెదిలే నా ఊహలతో
నిత్యం మనసుతో సంభాషిస్తూ
నా మనసునెప్పుడూ మరువద్దు
ప్రేమకు మొలిచిన ప్రశ్నలకు
బదులివ్వలేని బాధని బహుమతి చేసి
దాచుకొమ్మని సలహాలిస్తూ
నా మనసునెప్పుడూ మరువద్దు
ఉన్నది ఉన్నట్లుగా భావాలనీ
బాధ్యతగా పంచుతూ దగ్గరగా
దూరాన్ని చెరిపే చిత్రాన్ని చూపుతూ
నా మనసునెప్పుడూ మరువద్దు
అనుక్షణం నన్ను అక్షరాల్లో నింపి
కొండంత అర్థాన్ని కలిగిన కవితలా
రోజూ గానం చేసే గాయకుడిలా
నా మనసునెప్పుడూ మరువద్దు
పరగడుపునే పచ్చి నిజాలతో
ఒక్కో నిజంలో ఒక్కో రుచిని చూపి
మాట మాటలో మత్తును చల్లే గొంతుతో
నా మనసునెప్పుడూ మరువద్దు
నాలో ఎప్పుడో గడిపిన క్షణాన్ని
భద్రంగా పొదిగి వడ్డించి ఊరిస్తూ
ఏ క్షణం ఏడబాటును లేని ఆరాధికుడిలా
నా మనసునెప్పుడూ మరువద్దు
ఏవో గుర్తులను నాలో తవ్వుతూ
ఏదో శక్తితో నా మనసులో తిష్ట వేసి
పదే పదే నేను ఓడిపోయే ఇష్టంతో
నా మనసునెప్పుడూ మరువద్దు
రోజులో తొలి క్షణాన్ని అంకితమిచ్చి
అలుపులేని మెలకువతో నిద్రను లాక్కొని
నీ కలకు నా కళ్ళను దూరం చేస్తూ
నా మనసునెప్పుడూ మరువద్దు
నా చేతి ప్రేమకు పురుడు పోసుకున్న
మా సంపెంగ స్నేహా స్వరమై
మనసు కొమ్మపై వాలిన ప్రేమ పావురమై
నా మనసునెప్పుడూ మరువద్దు
రాత్రులు చిలికిన ఆలోచనలను
పగటి సంభాషణలో గుచ్చి
మాటలతో మనసును అదిలిస్తూ
నా మనసునెప్పుడూ మరువద్దు
నా లోతులో దాగిన నిజాన్ని
నా ముఖంలో వెతికే నిజాయితీతో
పూటకో సందేశం పంపుతూ
నా మనసునెప్పుడూ మరువద్దు
వందల కవితలతో ఊహల మెట్లు ఎక్కించి
హదయపు శిఖరాన నిలబెట్టి
దూరాన ఉన్నా చెవిలో మారు మ్రోగుతూ
నా మనసునెప్పుడూ మరువద్దు
ప్రతి రోజుని ఓ ఉత్తరంలా వ్రాసి
ఏ రోజుకు ఆ రోజునే
నిన్ను నాకు బట్వాడా చేస్తూ
నా మనసునెప్పుడూ మరువద్దు
నా నవ్వు చప్పుళ్లను
ఒడిసి పట్టిన నీ కంటి గుప్పెళ్లుతో
మనసుపై మరపురాని ముద్రవై
నా మనసునెప్పుడూ మరువద్దు
కోరిక పేరు చెప్పకుండా
ఆశ అడ్రస్‌ వ్రాయకుండా
జీవితాన్ని వ్రాసి పోస్ట్‌ చేసిన ప్రేమికుడిలా
నా మనసునెప్పుడూ మరువద్దు
– చందలూరి నారాయణరావు
9704437247

Spread the love